ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్.. ఉరఫ్ నాని.. టీడీపీలో చేరుతున్నారంటూ గత వారం పెద్ద ఎత్తున చర్చ సాగింది. ప్రధాన మీడియాలోనే ఈ వార్తలు రావడం.. ఇంకేముంది ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న చర్చ సాగడంతో ఆయన దాదాపు పార్టీ మారిపోతున్నారన్నది నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ, ఇటు టీడీపీ నుంచి అటు ఆళ్ల వర్గం నుంచి కూడా ఎక్కడా ఈ విషయంపై స్పందన రాలేదు.
దీంతో అసలు ఏం జరిగింది? క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? అనేవి ఆసక్తిగా మారా యి. ప్రస్తుతం వైసీపీ నుంచి వచ్చే నాయకులను చేర్చుకునే విషయంలో చంద్రబాబు సుముఖంగానే ఉన్నారు. వైసీపీని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలన్న కొందరి సూచనలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో చాలా మంది నాయకులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్నారు. అయితే.. ఆళ్ల విషయానికి వస్తే.. ఎందుకు బ్రేక్ పడిందన్నది చర్చ.
ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్ల నాని.. టీడీపీ నేతలను అణిచి వేశారన్న చర్చ ఉంది. ఫొటోలు ఆధారాలతో ఇటీవల ఇక్కడి నాయకులు బయట పెట్టారు. దీంతో చంద్రబాబు వెనక్కి తగ్గారన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. కానీ, అసలు విషయం వేరేగా ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా.. టీడీపీ టీం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆళ్ల నానికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని తెలిసింది.
మెజారిటీ ప్రజలు ఆయన రాజకీయాలను ఇష్టపడడం లేదని.. అందుకే.. చంద్రబాబు ఆళ్ల విషయంలో వెనక్కి తగ్గారని చెబుతున్నారు. కానీ, ఇప్పటి వరకు చేర్చుకున్నవారి విషయంలో ఐవీఆర్ఎస్ సర్వే చేయని చంద్రబాబు ఇప్పుడు ఆళ్ల విషయంలో ఎందుకు చేశారన్నది ప్రశ్న. ఎందుకంటే.. ఇప్పటి వరకు వచ్చిన వారిలో చాలా మంది పదవుల్లో ఉండి వచ్చారు. ఎమ్మెల్సీలు, ఎంపీలుగా ఉన్నవారే పార్టీ మారారు. దీంతో వారి విషయంలో బేధాభిప్రాయాలు ఉన్నా.. తీసుకున్నారు.
నిజానికి మోపిదేవి వెంకటరమణను పార్టీలో చేర్చుకునేందుకు.. ఓ కీలక మంత్రి అడ్డు పడ్డారు. అయినా.. చంద్రబాబు స్వాగతించారు. కానీ, ఆళ్ల విషయంలో మౌనంగా ఉన్నారు. దీనికి కారణం.. ఐవీఆర్ఎస్ సర్వే ఫలితమేనని అంటున్నారు సీనియర్ నాయకులు. ప్రజలు పెద్దగా ఆళ్ల నానిని పట్టించుకోవడం లేదని.. కాబట్టి.. ఆయనను చేర్చుకోలేదని.. భవిష్యత్తులో ఆయన ఇమేజ్ పెరిగితే.. చేర్చుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల.. తర్వాత పూర్తిగా రాజకీయ సన్యాసం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనే ఆయన ఇమేజ్‌ను డ్యామేజీ చేసిందని అంటున్నారు.