ఏపీలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పాలన దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలకమైన ముందడుగు పడుతోంది. జనవరి నుంచి ‘వాట్సాప్ పాలన’కు శ్రీకారం చుడుతోంది. ప్రజలకు అవసరమైన అన్ని సేవలను కూడా.. వాట్సాప్ ద్వారానే అందించనున్నారు. దీనికి జనవరి 1వ తేదీన ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్నితాజాగా మరోసారి సీఎం చంద్రబాబు కలెక్టర్లకు వివరించారు. వాట్సాప్ పాలన సక్సెస్ అయితే.. దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో వాట్సాప్ ద్వారా సేవలు అందించే రాష్ట్రం కూడా ఏపీనే అవుతుందన్నారు.
ఏంటీ పాలన..
వాట్సాప్ అనేది.. ప్రజలతో విడదీయరాని బంధం ఏర్పరుచుకున్న విషయం తెలిసిందే. ఆహ్వానాలు, సందేశాలు.. ఫొటోలు.. వీడియోలు ఇలా.. అనేక విధాలుగా వాట్సాప్ సాధారణ జనజీవనంలో ఓ భాగం అయిపోయింది. దీనిని పాలనకు అన్వయించడం అనేది భారత దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. ప్రస్తుతం దుబాయ్ దేశంలో ఈ తరహా సేవలు అందుతున్నాయి. ఉదాహరణకు వాట్సాప్‌లో కొన్ని బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయి. డిపాజిట్ల నుంచి డెబిట్ వరకు.. వాట్సాప్ సేవలు అందుతున్నాయి. ఈ తరహాలోనే ప్రభుత్వం కూడా వాట్సాప్ సేవలు అందించనుంది. ఎడారి దేశం దుబాయ్‌లో ఈ ప్రయోగం సక్సెస్అయింది.
ఏం చేస్తారు?
- వాట్సాప్ ద్వారా ప్రజలకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికేట్లను పొందవచ్చు.
- వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి వివరించి.. గంటల వ్యవధిలోనే పరిష్కారం పొందే వీలుంటుంది.
- యూఏఈ(దుబాయ్) తర్వాత ఈ సేవలు తీసుకొస్తోంది ఏపీనే.
- వాట్సాప్‌లో వచ్చే అన్ని అంశాలను Ap.gov.in సైట్ లో ఉంచుతారు.
- వాట్సాప్ ద్వారా 153 సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం అయింది.
- వాట్సాప్ ద్వారానే సులభంగా పన్నులు చెల్లించవచ్చు.
- వాట్సాప్ ద్వారా దేవాదాయ, రెవెన్యూ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన సేవలు చేరువ కానున్నాయి.
- ఫేజ్-1లో 100 నుండి 150 సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
- ఇన్‌కమ్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, క్యాస్ట్, స్టడీ సర్టిఫికేట్ లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు.