టీడీపీ ఆశల వారధి.. భావి అధ్యక్షుడిగా ప్రచారంలో ఉన్న నారా లోకేష్‌పై.. ఆయన పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గంలో సటైర్లు పేలుతున్నాయి. అయ్యా.. సారూ.. అప్పుడే మరిచిపోయారా? అంటూ ఇక్కడి యువత వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. నిజమే.. లోకేష్ వ్యవహార శైలిని చూస్తే.. ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలే అంటుండడం గమనార్హం. గత ఏడాది ఎన్నికల్లో తొలిసారి రంగంలోకి దిగిన లోకేష్.. బీసీలు ఎక్కువగా ఉన్న మంగళగిరి నుంచి పోటీ చేశారు. బీసీలే ఆయనను గెలిపిస్తారని అనుకున్నారు. అంతేకాదు, బీసీలేకాకుండా రాజధాని నిర్మాణం కూడా ఉన్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ కూడా లోకేష్‌కు అనుకూలంగా మారుతుందని అంచనాలు వేసుకున్నారు.
అయితే, లోకేష్ పరాజయం పాలయ్యారు. చిత్రం ఏంటంటే.. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంజి చిరంజీవి.. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయి.. రికార్డు సృష్టించారు. కానీ, గత ఏడాది జరిగిన ఎన్నికల్లో లోకేష్.. గట్టి పోటీ ఇచ్చినా.. 5 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే.. ఈ ఓటమి లోకేష్‌కు తీవ్ర ఇబ్బంది కలిగించిందని, వచ్చే ఎన్నికల నాటికి ఆయన వేరే నియోజకవర్గం వెతుక్కుంటారని అనేక విశ్లేషణలు వచ్చాయి. కానీ, లోకేష్ మాత్రం ఈ ఓటమి బలాన్ని ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పారు. మంచిదే.. నియోజకవర్గంపై పట్టు పెంచుకుని గెలుపుకోసం ఆయన ప్రయత్నించడాన్ని ఎవరూ తప్పుపట్టరు.
కానీ, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇప్పటి వరకు నియోజకవర్గం వైపు లోకేష్ కన్నెత్తి చూడలే దని, ప్రజలను, తనకు ఎన్నికల్లో సహకరించిన వారిని పన్నెత్తి పలకరించలేదని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కరోనా నేపథ్యంలో తన నియోజకవర్గంలోని మీడియా మిత్రులకు బీమా చేయించానని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇది మంచిపరిణామమే అయినా.. నియోజకవర్గంలో ప్రజలను కూడా ఆయన పట్టించుకోవాలి కదా? ఇప్పటి నుంచి ప్రయత్నిస్తేనే కదా.. నియోజకవర్గంపై పట్టు చిక్కుతుంది? అంటున్నారు. కానీ, లోకేష్ మాత్రం హైదరాబాద్‌కే పరిమితమై.. పిట్ట(ట్విట్టర్) కబుర్లు చెబుతున్నారని విమర్శలు సంధిస్తున్నారు. మరి లోకేష్ ఈ కీలకమైన నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా రంగంలోకిదిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates