అప్రూవ‌ర్‌గా బోరుగ‌డ్డ‌.. వైసీపీకి ఇబ్బందేనా ..!

బోరుగ‌డ్డ అనిల్ కుమార్‌. వైసీపీ సానుభూతి ప‌రుడుగా పేరు తెచ్చుకున్న ఆయ‌న గ‌తంలో టీడీపీ అధినే త చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అదేస‌మ‌యంలో అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను ఎవ‌రైనా విమ‌ర్శించినా.. ఆయ‌న నిప్పులు చెరిగారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా.. తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. మ‌హిళ‌ల‌ని కూడా చూడ‌కుండా నానా బూతుల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, ఈయ‌న‌పై వైసీపీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే గుంటూరుకు చెందిన ఓ పాస్ట‌ర్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు బోరుగ‌డ్డ‌ను పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత‌.. ప‌లు జిల్లాల్లో సోష‌ల్ మీడియా కేసులు కూడా న‌మోద‌య్యాయి. ప్ర‌స్తుతం జైల్లో ఉన్న బోరుగడ్డ‌ను ప‌లు జిల్లాల పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా వైసీపీ నుంచి త‌న‌కు ఎలాంటి సానుభూతి ద‌క్క‌క పోవ‌డం.. న్యాయ‌ప‌ర‌మైన స‌హ‌కారం కూడా అంద‌క‌పోవ‌డంతో బోరుగ‌డ్డ కుమిలి పోతున్నారు.

దీనికి తోడు.. పోలీసుల విచార‌ణ కూడా తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో బోరుగ‌డ్డ అప్రూవ‌ర్‌గా మారుతున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. తాను చేసిన వ్యాఖ్య‌లు, బెదిరింపుల వెనుక‌.. వైసీపీలోకి కీల‌క‌మైన ఇద్ద‌రు వ్య‌క్తులు ఉన్నార‌ని.. పోలీసుల‌కు వాంగ్మూలం ఇచ్చిన‌ట్టు తెలిసింది. వారు తాడేప‌ల్లి కేంద్రంగా రాజ‌కీయాలు చేస్తార‌ని.. బ‌య‌ట‌కు రార‌ని కూడా ఆయ‌న చెప్పిన‌ట్టు పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్ర‌మంలో నే మ‌రింత లోతుగా ఆయ‌న‌ను విచారిస్తున్నారు.

ఈ విచార‌ణ మ‌రింత తీవ్ర‌మైతే.. బోరుగ‌డ్డ అప్రూవ‌ర్‌గా మారి.. వైసీపీ నేత‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో ఈ కేసులు త‌న మెడ‌కు చుట్టుకోకుండా కూడా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామం ఇప్పుడు వైసీపీని కుదిపేస్తోంది. అప్రూవ‌ర్‌గా మారి నిజాలు చెబితే.. మ‌రింత మందికి సోష‌ల్ మీడియా స‌హా.. ఇత‌ర కేసులు చుట్టుకుంటాయ‌ని తెలుస్తోంది. ఇది వైసీపీకి మ‌రింత న‌ష్టం క‌లిగిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.