పుష్ప క్రేజ్ ను వాడేసిన కేజ్రీ..తగ్గేదేలే!

దేశమంతా పుష్ప మేనియాతో ఊగిపోతోన్న సంగతి తెలిసిందే. పుష్పరాజ్ రాజేసిన వైల్డ్ ఫైర్ సినీ అభిమానులు మొదలు రాజకీయ నాయకుల వరకు పాకింది. ఎక్కడ చూసినా అస్సలు తగ్గేదేలే…రప్ప రప్ప…అంటూ పుష్ప మేనరిజాన్ని, డైలాగులను ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. త్వరలో జరగబోతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పుష్పను ఆప్, బీజేపీ నేతలు పోటాపోటీగా వాడిపడేశారు.

రాబోయే ఎన్నికల్లో ఆప్ జాతీయాధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం తగ్గేదేలే అంటూ ఆప్ నేతలు ఓ పోస్టర్ ను ఇటీవల విడుదల చేశారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఇరికించినా అస్సలు తగ్గేదేలే అని, రాబోయే ఎన్నికల్లో ఆప్ అన్ని సీట్లు ఊడ్చిపడేయడం ఖాయమని కేజ్రీవాల్ 4 అంటూ ఆయన చీపురు పట్టుకున్న పోస్టర్ ను ఆప్ నేతలు ప్రచారం చేశారు. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ హ్యాట్రిక్ కొట్టిన నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి వరుసగా నాలుగోసారి అధికారం చేపడుతుందని కాన్ఫిడెంట్ గా ఆప్ నేతలు ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక, ఆప్ నేతలకు ఏ మాత్రం తగ్గని బీజేపీ నేతలు రప్ప రప్ప అంటూ బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పుష్పగాడిలా కుర్చీలా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న సచ్ దేవ్ పోస్టర్లు ఢిల్లీలోని గల్లీగల్లీలో అంటించారు బీజేపీ నేతలు. 1998 తర్వాత ఢిల్లీ గద్దె మీద బీజేపీ కూర్చోలేదు. దీంతో, ఈ సారి ఎలాగైనా గెలవాలని కాషాయ దళం కంకణం కట్టుకుంది. ఈ రెండు పార్టీల పోస్టర్ వార్ తో  ఎముకలు గడ్డకట్టే చలిలోనూ ఢిల్లీ రాజకీయ వాతావరణం వేడెక్కింది.