తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్పు, రేవంత్ రెడ్డి-అదానీ ఇష్యూతో పాటు కాంగ్రెస్ ఏడాది పాలనపై విమర్శలు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు రెడీగా ఉన్నారు. సభను స్తంభింపజేసేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అదానీ-రేవంత్ ల మధ్య స్నేహం ఉందంటూ వారి ఫొటోలు ముద్రించిన టీ షర్టులన ధరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు వెళ్లబోయారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ దగ్గర వారిని పోలీసులు అడ్డుకున్నారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. టీ షర్ట్ ఉంటే అసెంబ్లీలోకి అనుమతించబోమని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీ గేటు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో, కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
దీంతో, పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ గేట్ ముందుకు భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో, ప్రతిపక్షం లేకుండానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.