ఆళ్ల రామకృష్ణారెడ్డి. పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. మంగళగిరి నియోజకవర్గంనుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు. అయితే.. ఈ ఏడాది టికెట్ దక్కక పోవడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చి.. మళ్లీ చర్చలు ఫలించి ఆ పార్టీలో ఉన్నారు. కానీ, ప్రస్తుతం ఆయన ఉనికి ఎక్కడా కనిపించడం లేదు. జగన్ పెడుతున్న సమావేశాలకు కూడా ఆళ్ల డుమ్మా కొడుతున్నారు. మరోవైపు..జనసేన వైపు ఆయన చూస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎటు వైపు టర్న్ తీసుకుంటారనేది చెప్పడం కష్టం. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ శత్రువులు కారు. అయితే.. అవకాశం, అవసరం మాత్రమే చూసుకుంటారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే.. ఆళ్ల వైసీపీలోనే ఉండడం మంచిదని.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తప్పకుండా మంగళగిరి సీటు వస్తుందని అనేవారు కూడా ఉన్నారు. అలా కాదని జనసేనలోకివెళ్లినా.. మంగళగిరిలో నారా లోకేష్‌ను తప్పించి.. ఈయనకు సీటు ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు.
అయితే.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. వచ్చే నాలుగు సంవత్సరాల పాటు అసలు యాక్టివ్‌గా లేకపోతే.. ఇబ్బందులు తప్పవన్నది ఆళ్లకు అత్యంత సన్నిహితంగా ఉన్న రెడ్డి నాయకుడు ఒకరు చెబుతున్నారు. అందుకే.. ఏదో ఒక పార్టీలో ఉంటే..త మకు ప్రాధాన్యం లభిస్తుందని అంటున్నా రు. వచ్చే ఎన్నికల నాటికి అవసరమైతే.. మరో నియోజకవర్గాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుందని కూడా చెబుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి .. నియోజకవర్గాలు పెరిగితే.. ఛాన్స్ దక్కకపోదని కూడా ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ఇక, జనసేనలోకి ఎందుకు వెళ్తారన్నప్రశ్నలకు కూడా.. సమాధానం చెబుతున్నారు. రాజకీయంగా ఇప్పటి వరకు.. ఆళ్ల జనసేనపై ఎలాంటి విమర్శలు చేయలేదు. కానీ, టీడీపీతో మాత్రం ఆయన తీవ్రస్థాయిలో విభేదాలు కొని తెచ్చుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఆయన కేసులపై కేసులు వేశారు. కానీ,జనసేనపై ఒక్క మాట కూడా అనలేదు. ఈ నేపథ్యంలో జనసేన అయితే.. ప్రస్తుతానికి సేఫ్ అనే దారి కనిపిస్తోందని, అందుకే తమ నాయకుడు జనసేన వైపు చూస్తున్నారని వారు చెబుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.