గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) రాజాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు 11 మంది అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని గన్నవరం మండలం బాపులపాడు పోలీసు స్టేషన్‌లో విచారిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా గన్నవరం రాజకీయాలు వేడెక్కినట్టు అయింది. నిన్న మొన్నటి వరకు పీఎ రాజా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు ఇప్పటికి రెండు సార్లు వార్నింగులు కూడా ఇచ్చారు.
ఏంటీ కేసు?
గన్నవరం నియోజకవర్గంలో వంశీ అనుచరుల దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఆయన వరుస విజయాలతో నియోజకవర్గంలో అప్రతిహతంగా దూసుకుపోయారు. ఈ క్రమంలోనే 2019-24 మధ్య టీడీపీ తరఫున గెలిచినప్పటికీ.. మధ్యలో వైసీపీకి జై కొట్టారు. ఆ తర్వాత.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. ఇతర నాయకులపైనా తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అదునుగా.. స్థానిక పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
ఈ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సమయంలో నలుగురు నాయకులు అక్కడే ఉన్నారు. వారిని కూడా చితక బాదారు. ఈ పరిణామాలపై అప్పట్లోనే పోలీసులు కేసులు నమోదు చేసినా.. వైసీపీ హయాంలో ఈ కేసులు ముందుకు సాగలేదు. ఇక, టీడీపీ కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసు వేగవంతం అయింది. ఈ క్రమంలోనే వంశీ అనుచరులను అరెస్టు చేసిన పోలీసులు వంశీ పీఏ కోసం వెతులాట ప్రారంభించారు. గురువారం రాత్రి ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని దాడి చేసి అరెస్టు చేశారు.
ఇక, ఈ పరిణామాలను గమనిస్తే.. మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆయనపై కూడా పోలీసులు కేసు నమోదు చేయొచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పీఏ ఇచ్చే సమాచారం ఆధారంగా.. టీడీపీ ఆఫీసుపై దాడిని ఎవరు ప్రోత్సహించారన్న విషయంపై పోలీసులు కూపీ లాగి వంశీపైనా కేసు పెట్టవచ్చన్నది రాజకీయ వర్గాల మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.