ఏపీ సీఎం చంద్రబాబుపై గత రెండు రోజులుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి మరోసారి తన అక్కసు ప్రదర్శించారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై తనకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సాయిరెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘బతికి ఉంటే.. అరెస్టు తప్పదు’ అంటూ.. ఎవరూ సహించని భాషను ప్రయోగించారు. అంతేకాదు.. చంద్రబాబు దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు అంటూ.. ఎప్పుడూ అనే వ్యాఖ్యలనే ప్రయోగించారు.
ఇక, ఇప్పుడు తాజాగా ’75 ఏళ్ల ముసలాయన’ అంటూ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు మాత్రమే జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు అవకాశం ఉందని.. 75 ఏళ్ల ముసలాయనకు లేదని వ్యాఖ్యానించారు. కానీ, ఆయన నటిస్తున్నాడని అన్నారు. ఎన్డీయే కూటమిలో పవన్ కళ్యాణ్ కే ఆ సామర్ధ్యం ఉందన్న సాయిరెడ్డి జాతీయస్థాయిలో పుంజుకుంటాడని చెప్పుకొచ్చారు.
అంతేకాదు..ఎన్డీయే కూటమి పార్టీల నేతలతో పోల్చుకుంటే పవన్ కల్యాణ్ ఒక్కడే యువ నాయకుడని సాయిరెడ్డి చెప్పడం గమనార్హం. ఇదేసమయంలో ఆయనకు మాత్రమే జాతీయ స్థాయిలో రేంజ్ పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇక, గురువారం కూడా.. చంద్రబాబును తిట్టిపోసిన సాయిరెడ్డి పవన్‌పై పొగడ్తలు కురిపించడం గమనార్హం. పవన్ మంచి ఫ్యూచర్ ఉందని.. ఆయన ఇలాంటి పనుల్లో వేలు పెట్టవద్దని తప్పులు చేయొద్దని హితవచనాలు పలకడం గమనార్హం. మొత్తంగా.. సాయిరెడ్డి పవన్‌ను కాకా పడుతూ.. చంద్రబాబుపై విమర్శలు చేయడం రాజకీయంగా చర్చకు వస్తోంది.