హైదరాబాద్.. ఎంత సుందర నగరమో.. అంతే కష్టాలకు కూడా కేంద్రం. చిన్నపాటి వర్షానికే మునిగిపోవడం.. ఎటు చూసినా ట్రాఫిక్‌తో కొట్టుమిట్టాడే సగటు జీవి.. మనకు ఇక్కడే కనిపిస్తాడు. ఉదయం 8-10, సాయంత్రం 4-8 అడుగు తీసి బయట పెట్టాలం టే ఆపశోపాలు పడాల్సిందే. కిలో మీటరు దూరం ప్రయాణించేందుకు నానా కష్టాలు పడాల్సిందే. దీనికి కారణం భారీగా పెరిగిపో యి వాహనాలు.. ప్రజలు! దీంతో ట్రాఫిక్ కష్టాలు ఇంతింత కదయా! అనే నానుడి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ కష్టాల నుంచి నగర వాసులను బయట పడేసేందుకు పోలీసు సిబ్బందిని పెంచినా.. సాధ్యం కావడం లేదు.
ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని రోజుల కిందట సంచలన నిర్ణయం తీసుకున్నారు. హిజ్రాలను ట్రాఫిక్ వలంటీర్లుగా వినియోగించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే సుమారు 3 వేల మంది హిజ్రాలను గుర్తించిన పోలీసులు.. వారికి ఉన్న చదువు, ఇతరత్ర పరిజ్ఞానాల మేరకు.. వందల సంఖ్యలో ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేసిన వారికి హైదరాబాద్ గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టారు. 800 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందెం సహా, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్(సదరు కానిస్టేబుల్ అర్హతలు) నిర్వహించారు.
వీటిలో ఉత్తీర్ణులైన 44 మందిని ఎంపిక చేశారు. వీరికి త్వరలోనే నగర ట్రాఫిక్‌పై శిక్షణ ఇచ్చి.. వలంటీర్లుగా నియమిస్తారు. అయితే.. వీరు వలంటీర్లు మాత్రమే. పోలీసులకు ఉండే అధికారాలు కానీ, ఉద్యోగ భద్రతకానీ ఉండదనిచెబుతున్నారు. అయితే.. నిర్దేశిత జీతం మాత్రం అందుతుంది. ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే.. ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. అనారోగ్యం పాలైతే.. ప్రభుత్వ సాయం అందిస్తారు.
చేరాలనుకునేవారికి రెడ్ కార్పెట్..
ప్రస్తుతం తొలి బ్యాచ్‌ను నగరంలోకి పంపుతున్న పోలీసు అధికారులు మరింత మందికి ఆహ్వానం పలుకుతున్నారు. హిజ్రాలు ఎవరైనా ట్రాఫిక్ డ్యూటీ వలంటీర్‌గా చేయాలని అనుకుంటే.. రావాలని కోరుతున్నారు. 18 ఏళ్లు పూర్తైన వారు, టెన్త్ సర్టిఫికెట్, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్టు చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి 10 రోజులు ట్రాఫిక్ విధులపై శిక్షణ ఇచ్చి అనంతరం విధులు కేటాయిస్తారు. వీరికి ప్రత్యేక యూనిఫాం ప్రభుత్వమే సమకూర్చనుంది.