మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు దాటినా ముఖ్యమంత్రి పీఠంపై మాత్రం పీటముడి వీడలేదు. ఆపద్ధర్మ సీఎం షిండే తనకు మరో చాన్స్ వస్తుందేమోనని ఆశించారు. అయితే, ఈ సారి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఫడ్నవీస్ ను సీఎం చేయాలని బీజేపీ పెద్దలు భావించారు. ఈ క్రమంలోనే సీఎం సీటుపై హైడ్రామాకు నేటితో తెరపడింది. మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారైంది. ఫడ్నవీస్ పేరును బీజేపీ కోర్ కమిటీ నిర్ణయించింది.

ముంబైలోని విధాన్ భవన్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల శాసన సభాసక్ష సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఫడ్నవీస్ ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఈ నెల 5న ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన పలువురు కీలక నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.

సీఎం పదవితో పాటు హోంమంత్రి, స్పీకర్ పదవులు బీజేపీకి దక్కున్నాయి. ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గానికి , శివసేన(ఏక్ నాథ్ షిండే) వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కుతాయి. మంత్రివర్గంలో 43 మందికి చాన్స్ ఉండగా… 21 బీజేపీ తీసుకోనుంది. శివసేన (షిండే) వర్గం 12, ఎన్సీపీ (అజిత్ పవార్ ) వర్గం 10 తీసుకోనుంది. సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఆహ్వాన పత్రం కూడా సర్క్యులేట్ అవుతోంది. అయితే, ఈ వ్యవహారంపై అధికారికంగా పూర్తిస్థాయి ప్రకటన వెలువడాల్సి ఉంది.