మోడీకి మేలు చేస్తున్న ఇండియా కూట‌మినేత‌లు!

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మిలో తాజాగా స్ప‌ర్థ‌లు చోటు చేసుకున్నాయి. ఎవ‌రికివారే.. త‌మ త‌మ డిమాండ్ల‌పై ప‌ట్టుబ‌ట్ట‌డంతో ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్ వ్యూహం బెడిసికొట్టిన‌ట్ట‌యింది. వాస్త‌వానికి పార్ల‌మెంటులో గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ స‌హా .. మిత్ర‌ప‌క్షాలు.. రెండు మూడు ర‌కాల డిమాండ్ల‌ను వినిపిస్తున్నాయి. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీపై అమెరికాలో న‌మోదైన కేసులు.. అదేవిధంగా మ‌ణిపూర్ అల్ల‌ర్ల‌పై పెద్ద ఎత్తున స‌భ‌ల్లో ర‌గ‌డ సృష్టిస్తున్నారు. దీంతో లోక్‌స‌భ , రాజ్య‌స‌భ కూడా వాయిదాల‌పై వాయిదాలు ప‌డుతూనే ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా సోమ‌వారం సాయంత్రం స్పీక‌ర్ ఓం బిర్లా, రాజ్య‌స‌భ చైర్మ‌న్ జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌లు ప్ర‌తిప‌క్షాల‌తో చ‌ర్చించారు. రాజ్యాంగంపై చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పిస్తామని స‌భ‌లో అంత‌రాయాలు సృష్టించవ‌ద్ద‌ని కూడా సూచించారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు ఓకే చెప్పాయి. కానీ, ఏమైందో ఏమో.. అనూహ్యంగా మ‌ళ్లీ నిర‌స‌న బాట‌ప‌ట్టాయి. అయితే.. ఈసారి ఇండియా కూట‌మిలోని పార్టీలు ఎవ‌రికి వారుగా.. స్పందించారు. అంతేకాదు.. క‌లివి ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇండియా కూట‌మిలో కాంగ్రెస్‌కు అండ‌గా ఉన్న స‌మాజ్ వాదీ పార్టీ.. తాజాగా పార్ల‌మెంటులో సొంత నినాదాల‌తో ఆందోళ‌న‌కు దిగారు ఆ పార్టీ ఎంపీలు. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు కూడా.. త‌మ రాష్ట్రానికి చెందిన సొంత స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారు. అంతేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ చెబుతున్న అదానీ కేసులను ఈ రెండు పార్టీల ఎంపీలు కూడా.. లైట్ తీసుకున్నారు. అస‌లు దానికంటే కూడా.. త‌మ త‌మ రాష్ట్రాల్లో జ‌రుగుతున్న వివాదాల‌పైనే చ‌ర్చించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాహుల్ నాయ‌కత్వంలో మ‌క‌ర ద్వారం వ‌ద్ద నిల‌బ‌డి ఆందోళ‌న చేశారు. మొత్తంగా చూస్తే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాహుల్‌కు అండ‌గా ఉన్న ఇండియా కూట‌మి పార్టీల‌లో ఇలా ముస‌లం పుట్ట‌డంతో బీజేపీ నేత‌లు చాలా ఆస‌క్తిగా ప‌రిశీలిస్తున్నారు. ఇది రాజ‌కీయంగా కాంగ్రెస్‌ను బ‌ల‌హీన‌ప‌రుస్తుంటే.. బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి గతంలో మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు, త‌ర్వాత మ‌ణిపూర్ అంశం, ఇప్పుడు అదానీ వ్య‌వ‌హారం.. ఇలా అన్ని విష‌యాల్లోనూ కాంగ్రెస్ చివ‌ర‌కు ఏకాకి అవుతుండ‌డం గ‌మ‌నార్హం.