ఏపీలో బ‌ల‌మైన మీడియాతో.. బ‌ల‌హీన విప‌క్షం

ఏమాట‌కు ఆమాట చెప్పాల్సి వ‌స్తే.. ఏపీలో బ‌ల‌మైన మీడియా ఏదంటే ఓ రెండు ప‌త్రిక‌లు, ఓ మూడు చానెళ్లు మాత్ర‌మే క‌నిపిస్తాయి వినిపిస్తాయి. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా.. ఈ బ‌ల‌మైన మీడియా బాధితుడే. ఆయ‌నే ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్పుకొనేవారు. బ‌ల‌మైన మీడియా కార‌ణంగా తాము నెగ్గ‌లేక‌పోతున్నామ‌ని.. అబద్ధాలు ప్ర‌చారం చేయడంలో గోబెల్స్‌ను మించి పోతున్నార‌ని కూడా.. వైఎస్ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఈ నేప‌థ్యంలోనే రాత్రికి రాత్రికి 2006లో సాక్షి మీడియాకు శ్రీకారం చుట్టారు. కేవ‌లం అనుకున్న వెంట‌నే ఒకే ఒక్క ఏడాదిలో దీనిని ప్రారంభించారు. అయిన‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన మీడియా ముందు .. సాక్షి.. స‌సాక్ష్యంగా నిలువ‌లేక పోయింది. ఇక‌, ఆ త‌ర్వాత కూడా.. అదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యానికి కూడా ఈ మీడియానే కార‌ణ‌మ‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు.

అయితే.. ఇప్పుడు అదే బ‌ల‌మైన మీడియాతో సంఖ్యాప‌రంగా అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న వైసీపీ ఢీ అంటే ఢీ అంటూ డిష్యుం- డిష్యుంకు రెడీ అయింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న‌పై అతిగా వార్త‌లు రాస్తున్నారని.. ముఖ్యంగా అదానీ ప‌వ‌ర్ విష‌యంలో తాను లంచాలు తీసుకున్న‌ట్టు ఆరోపిస్తున్నార‌ని, కానీ, తాను ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు మీడియా సంస్థ‌ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని చెప్పారు.

త‌న పేరుతో ముద్రించిన వార్త‌ల స్థానంలో క్ష‌మాప‌ణ‌లు చెబుతూ.. రాయాల‌ని కూడా జ‌గ‌న్ కోరారు. కానీ, ఆయా మీడియా సంస్థ‌లు ఎక్క‌డా స్పందించ‌లేదు. దీంతో తాజాగా శ‌నివారం జ‌గ‌న్ ఆ రెండు సంస్థ‌ల‌కు లీగల్ నోటీసులు పంపించారు. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరారు. లేకపోతే.. కోర్టులో పోరాటానికి దిగుతాన‌ని చెప్పారు. అయితే.. ఈక్ర‌మంలో త‌న ప‌రువును కేవ‌లం క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం చేయ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ప‌రువు న‌ష్టం కేసులు అంటే.. వారి వారి స్థాయిని బ‌ట్టి వేల నుంచి వంద‌ల కోట్లలో ఈ కేసులు ఉంటాయి. కానీ, జ‌గ‌న్ ఎందుకో.. ఈ విస‌యంలో సొమ్ములు కాకుండా.. క్ష‌మాప‌ణ‌ల‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి త‌దుప‌రి.. ఆరెండు ప‌త్రిక‌లు.. ఏం చేస్తాయ‌నేది చూడాలి.