తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ కాపు నాయకులు కత్తి యుద్ధం చేసు కుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేసులు పెట్టుకుంటున్నారు. నిజానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్దగా ఎక్కడా విభేదాలు పెట్టుకోరు. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ.. సానుకూలంగా ఉంటారు. తమలో తాము చర్చించుకుని పరిష్కరించారు. కానీ, చిత్రంగా తూర్పులో మాత్రం కాపు నేతల మధ్యే పచ్చగడ్డి వేస్తే.. భగ్గు మనే పరిస్థితి ఏర్పడింది. విషయంలోకి వెళ్తే.. ఈ నియోజకవర్గంలో పర్వత, వరుపుల కుటుంబాల ఆధిపత్యం ఎక్కువ. వరుపుల కుటుంబం నుంచి నాలుగు తరాల నాయకులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుపు గుర్రం ఎక్కారు.
ఇక, పర్వత కుటుంబం నుంచి రెండు తరాల నాయకులు ఇక్కడే చక్రం తిప్పుతున్నారు. అయితే, ఆది నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వాలు కూడా ఉండడంతో కలిసి మెలిసి రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇరు పక్షాలు గతంలో కాంగ్రెస్-టీడీపీల్లో ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పోయి.. వైసీపీలో చేరినా.. పర్వత, వరుపుల ఫ్యామిలీలు సజావుగానే ఉన్నాయి. అయితే, యువ నేతలు రాజకీయ రంగం ప్రవేశం చేయడంతో పరిస్థితి మారిపోయింది. పర్వత పూర్ణచంద్రప్రసాద్.. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయం సాధించారు. అదేసమయంలో వరుపుల రాజా.. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
గెలుపు ఓటములు సహజమే అయితే.. నాయకులు ఇక్కడ ఆధిపత్య థోరణిని ప్రదర్శించేందుకు ప్రయత్నించడమే వివాదాలకు దారితీసింది. టీడీపీ నుంచి ఓడిపోయిన వరుపుల రాజా.. వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. పైగా గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్తిపాడులో అన్నీ తానే అయి చక్రం తిప్పడంతో.. వైసీపీ అధికారంలోకి రావడంతో తాను మళ్లీ అధికార గూటికి వచ్చి.. అన్నీ చక్కబెట్టుకుందామని అనుకున్నారు. కానీ, పర్వత పూర్ణ మాత్రం వరుపుల రాజా దూకుడుకు కళ్లెం వేశారు. జగన్ దగ్గర చక్రంతిప్పారు. రాజాను పార్టీలో చేర్చుకోవద్దని భీష్మించారు. దీంతో జగన్ మౌనం పాటించారు. అంటే.. రాజానుపార్టలోకి చేర్చుకోలేదు.
ఫలితంగా పర్వత తొలి విజయం సాధించారు. అంతటితో ఆయన ఆగిపోలేదు.. రాజా.. గతంలో టీడీపీ హయాంలో డీసీసీబీ చైర్మన్గా ఉన్నప్పుడు అక్రమాలు జరిగాయని, విచారణ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో ఈ ఏడాది ప్రారంభంలో జగన్ విచారణకు కూడా ఆదేశించారు. దీంతో దాదాపు 20 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు.. తేల్చారు. వివిధ కేసుల్లో రాజా పేరును చేర్చారు.అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. అయితే, హైకోర్టుకు వెళ్లిన రాజా.. అరెస్టుపై స్టే తెచ్చుకున్నారు. ఇక, అప్పటి నుంచి రాజా వర్సెస్ పూర్ణల మధ్య వివాదాలు ముదిరి పాకాన పడ్డాయి. ఇద్దరు కాపు నాయకులు కావడంతో టీడీపీ, వైసీపీల నుంచి కాపు నేతలు రంగంలోకి దిగి రాజీ చేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలించలేదు.
ఇప్పటికీ ఇక్కడ ఇద్దరు నేతలు ఆధిపత్య పోరులో బిజీ గా ఉండడంతో నియోజకవర్గాన్ని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరి ఎప్పటికి ఈ వివాదానికి తెరపడుతుందో చూడాలి.