ప‌ద‌వుల కోసం వెయిటింగ్‌.. బాబు క‌రుణిస్తారా..!

ఇద్ద‌రు మ‌హిళా నాయ‌కులు ప‌ద‌వుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే టికెట్లు ద‌క్క‌క ఉసూరు మంటున్న వీరు.. ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వులు సైతం ద‌క్క‌క అల్లాడిపోతున్నారు. అంతేకాదు.. వారికంటే వెనుకాల పార్టీలో చేరిన వారికి ప‌ద‌వులు ద‌క్కుతుండ‌డం.. తామేమో మౌనంగా ఉన్న నేప‌థ్యంలో ప‌ద‌వుల ప‌రిస్థితి వీరికి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇప్పుడు ఏంచేయాల‌న్న దానిపై అంత‌ర్మ‌థ‌నంలో ప‌డ్డారు.

వారే .. ఒక‌రు పాడేరు మాజీ ఎమ్మెల్యే, ఎస్టీ నాయ‌కురాలు గిడ్డి ఈశ్వ‌రి, మ‌రొక‌రు మాజీ మంత్రి, ఎస్టీ నాయకురాలు మ‌త్య్స‌రాస మ‌ణికుమారి. గిడ్డి ఈశ్వ‌రి వాస్త‌వానికి వైసీపీతో రాజ‌కీయాలు ప్రారంభించారు. 2014 లో పాడేరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అప్ప‌ట్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి ఉంటే.. ఆమె మంత్రి అయ్యే వార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. దీంతో ఆమె టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ప‌ద‌వి ఖాయం అనుకున్నారు. కానీ, తాను చేసుకున్న కామెంట్లే.. ఈ ప‌ద‌విని దూరం చేశాయి.

ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా ద‌క్క‌లేదు. దీంతో ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వి కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. పొరుగున ఉన్న అర‌కులో చాలా మందికి ప‌ద‌వులు ద‌క్క‌డం.. త‌న‌కు ద‌క్క‌క పోవ‌డంతో గిడ్డి ఈశ్వ‌రిపై ఒత్తిడి ఎక్కువ‌గానేఉంది. త‌ర‌చుగా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, టీడీపీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ద్వారా ఈశ్వ‌రి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు నామినేటెడ్ ఖాయ‌మ‌ని అనుకున్నారు. కానీ, రాలేదు.

ఇక‌, మాజీ మంత్రి మ‌త్య్స‌రాస మ‌ణికుమారి.. కూడా వెయిటింగ్‌లోనే ఉన్నారు. ప్ర‌త్య‌క్ష్ రాజ‌కీయాల‌కు దాదాపు దూరంగా ఉన్న మ‌ణికుమారి.. ఇప్పుడు ప‌ద‌వి ఇస్తే.. చాల‌ని, ఇక‌, రాజ‌కీయాల‌కు గుడ్ బై చెబుతాన‌ని అంటున్నారు. రెండు రోజుల కింద‌ట మంత్రినారాలోకేస్‌తోనూ ఆమె భేటీ అయ్యారు. త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పారు. దీనికి చూద్దా.. చేద్దాం అంటూ మంత్రి చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఇదే త‌న చివ‌రి కోరిక అని.. ఏదో ఒక ప‌ద‌విని ఇవ్వాల‌ని కూడా ఆమె కోర‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలోకూట‌మి ప్ర‌భుత్వం, పార్టీలు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటాయో చూడాలి.