సోలార్ విద్యుత్ ఒప్పందాల నేపథ్యంలో భారతీయ కుబేరులలో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఈ సోలార్ విద్యుత్ ఒప్పందాల కోసం ఏపీ మాజీ సీఎం జగన్ తో పాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంలకు అదానీ భారీగా ముడుపులిచ్చారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోకి ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’’కి అదానీ ఇస్తానని చెప్పిన 100 కోట్ల రూపాయల విరాళాన్ని తీసుకోబోమని రేవంత్ ప్రకటించారు.
కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా అదానీ అంశంపై రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం 100 కోట్ల రూపాయల విరాళం తీసుకోబోతోందని, రేవంత్ రెడ్డికి అదానీకి మధ్య చీకటి ఒప్పందాలున్నాయని బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. ఆ స్కిల్ యూనివర్సిటీకి ఎంతో మంది నిధులిచ్చారని, అదే మాదిరిగా అదానీ కూడా నిధులిచ్చారని రేవంత్ అన్నారు. అయితే, అదానీతోపాటు ఏ వ్యాపారవేత్తకైనా విరాళం ఇచ్చే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అంతేకాదు, అదానీ వివాదంతో తెలంగాణకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
అయితే, కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అదానీ ఇవ్వదలచిన విరాళాన్ని తమ ప్రభుత్వం తీసుకోవడం లేదని రేవంత్ చెప్పారు. అంతే కాదు, ఆ విరాళం వద్దని ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ నకు అధికారి జయేష్ రంజన్ లేఖ రాశారని చెప్పారు. అదానీ గ్రూప్ ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి ఇస్తామన్న వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని అన్నారు. కాబట్టి, దయచేసి ఆ 100 కోట్లను వర్సిటీకి బదిలీ చేయద్దు అని ఆ లేఖలో పేర్కొన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు.