వైసీపీకి దశ-దిశ కొరవడిందా? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా డుమ్మా కొట్టిన ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చేందుకు కూడా వారిని అంగీకరించలేదని పార్టీలోనే అంతర్గత చర్చ సాగుతోంది.
దీంతో పది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై వైసీపీకి ఉన్న జగన్ మినహా 10 మంది ఎమ్మెల్యేలు నోరు విప్పలేదు. కనీసం సమావేశాల గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఇది పార్టీకి, వ్యక్తిగతంగా జగన్‌కు కూడా భారీ మైనస్ అయిపోయింది.
ఇక, ఇప్పుడు సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీకి నలుగురు ఎంపీలు దక్కారు. కడప నుంచి అవినాష్‌రెడ్డి, అరకు నుంచి చెట్టి తనూజారాణి, తిరుపతి నుంచి మద్దెల గురుమూర్తి, రాజంపేట నుంచి పీవీ మిథున్‌రెడ్డి విజయంసాధించారు.
వీరిలో చెట్టి తనూజారాణి మినహా మిగిలిన వారు వరుసగా విజయం దక్కించుకున్నారు. మరి సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో వీరు ఏయే అంశాలపై మాట్లాడాలి? ఏయే అంశాలను సభలో ప్రస్తావించాలనే విషయాన్ని జగన్ చెప్పలేదు. కనీసం పార్లమెంటరీ పార్టీ నాయకులతో సమావేశం కూడా పెట్టలేదు.
మరోవైపు రాజ్యసభలోనూ 9 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే పార్టీ మారారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు యాదవ్‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 9 మంది వైసీపీలోనే ఉన్నారు. అంటే మొత్తంగా 13 మంది ఎంపీలు వైసీపీకి ఉన్నారు.
తాజాగా ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లో వీరు ఎలా వ్యవహరించాలనే విషయాన్ని జగన్ బ్రీఫ్ చేయలేదు. ప్రజల సమస్యలు కానీ, పార్టీ సమస్యలు కానీ.. ఆయన ప్రస్తావించలేదు. ఈ పనిని వదిలేసి బెంగళూరుకు వెళ్లిపోయారు. ఇదిలావుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకున్న 15 మంది పార్లమెంటు సభ్యులతోనూ.. శనివారమే మీటింగ్ పెట్టారు.
లోక్‌సభలో ఎలా వ్యవహరించాలో ఏయే అంశాలను ప్రస్తావించాలో తేల్చి చెప్పారు. అదానీ.. జగన్.. లంచాల అంశాలను ప్రస్తావించాలని, పోలవరం నిధులు, అమరావతి నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు త్వరగా వచ్చేలా పార్లమెంటులో ప్రశ్నించాలని దిశానిర్దేశం చేశారు. ఇక, జనసేన అధినేత తనకు ఉన్న ఇద్దరు ఎంపీలు బాలశౌరి, శ్రీనివాస్‌లతో భేటీ అయ్యారు. వారికి కూడా ఆయన దిశానిర్దేశం చేశారు.
అయితే.. ఎటొచ్చీ.. జగన్ మాత్రం తన పార్టీ ఎంపీలకు ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడం గమనార్హం. ఇదిలావుంటే, పార్లమెంటులో అదానీ-లంచాల వ్యవహారం, అమెరికాలో కేసుల వ్యవహారం పై ప్రతిపక్షాలు నిలదీయనున్నాయి. ఈ క్రమంలో జగన్‌కు ఇచ్చిన లంచాల వ్యవహారం కూడా పార్లమెంటును కుదిపేయనుంది.