కొన్ని కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో జరిగింది. తాజాగా అమెరికాలో కేసులు నమోదయ్యాయని, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి భారీ ఎత్తున ముడుపులు ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతం అదానీ వ్యవహారం.. దేశాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడి ఇప్పుడు ఏపీని కూడా తాకింది. జగన్ సైతం ముడుపులు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.
వాస్తవ నివేదిక ఎలా ఉందన్న విషయానికి వస్తే.. అదాని వంటి సంస్థలు ఏర్పాటు చేసే ప్రాజెక్టుల విషయంలో పక్కాగానే ఉంటాయి. అయితే.. ఇటీవల కాలంలో పెరిగిపోయిన పోటీ వాతావరణం .. రాజకీయ ఒత్తిడులు.. వంటివి కార్పొరేట్ సంస్థలను కూడా పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. సరే.. ఎవరు తప్పు చేసినా సమర్థించరాదన్నది వాస్తవం కాబట్టి.. గౌతం అదానీ నుంచి జగన్ సొమ్ములు తీసుకుని ఉంటే విచారణ చేస్తారు.
ఇదిలావుంటే.. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నేరుగా స్పందించేందుకు ఇబ్బంది పడుతున్నారు. సభలో పలువురు సభ్యులు చాలా దూకుడుగానే స్పందించారు. జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని సభ్యులు బాగానే నోరు చేసుకున్నారు. కానీ, చంద్రబాబు విషయానికి వస్తే.. మాత్రం ఆయన ఆచితూచి స్పందించారు. ఒకవైపు సున్నితంగా విమర్శిస్తూనే.. మరోవైపు చాలా వ్యూహం తోనే ముందుకు సాగారు.
దీనికి కారణం.. అదానీ వ్యవహారంలో ప్రధాని మోడీ కీలకంగా మారారు. అదానీ గుజరాత్‌కు చెందిన వ్యాపారి కావడం, ఆయన కు బీజేపీకి మధ్య అవినాభావ సంబంధం.. ఉండడం, ముఖ్యంగా మోడీ-అమిత్‌షా ద్వయానికి ఆయన మిత్రుడు కావడంతో చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించిన తీరు కూటమి ప్రభుత్వ వ్యూహానికి అద్దం పట్టింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి