మహారాష్ట్ర గెలుపులో పవన్ ఎలివేషన్స్

మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా సోలాపూర్‌లో నిర్వహించిన పవన్ ర్యాలీలు, రోడ్ షోలు అక్కడి ప్రజలను ఆకట్టుకోవడమే కాక, స్థానిక అభ్యర్థులకు బలమైన మద్దతు అందించాయి.

తాజాగా సోలాపూర్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోతే మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నా విజయం కోసం పవన్ జీ చేసిన సహాయం మరువలేనిది. ఆయన ర్యాలీ, రోడ్ షోలు ప్రజలను ప్రభావితం చేశాయి. పవన్ గారి ప్రసంగాలు నా ప్రచారానికి కొత్త ఊపునిచ్చాయి. ఆయన మద్దతు లేకపోతే ఈ స్థాయిలో విజయాన్ని సాధించడం అసాధ్యం” అని ఆయన అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ప్రచారం చేసిన సమయంలో సభలకు, రోడ్ షోలకు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. తెలుగునాట ఉన్న తన అభిమానులను ఆయన అక్కడ కూడా సాధించగలిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలోని నాయకులు, అభ్యర్థులు పవన్ కలిసిన తరవాత ఎదురైన జనం ప్రాబల్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం, వారి విజయం వెనుక పవన్ పాత్రను గుర్తించడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది.

ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రశంసలు, జనసేన మద్దతుదారుల హర్షధ్వానాలు ఈ అంశాన్ని మరింత హైలైట్ చేశాయి. ఇక పవన్ కల్యాణ్ ప్రభావం మహారాష్ట్రతో పాటు జాతీయ స్థాయిలో కూడా కనిపిస్తుందని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు. ఏపీలో ఇప్పటికే బలమైన రాజకీయ నేతగా తన స్థానాన్ని నిలబెట్టుకున్న పవన్, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తుండటంతో, ఆయనకు దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.