చైనాకు భారత్ స్మార్ట్షాక్…డ్రాగన్ కు చుక్కలే

కొంతకాలంగా భారత్ , చైనా ల సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. పాంగాంగ్‌, లడఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనా సేనల కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు భారత సైన్యం కూడా అదనపు దళాలను మోహరించింన సంగతి తెలిసిందే. డ్రాగన్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం కూడా భూతల, గగన తల, సముద్ర మార్గాల్లో అస్త్రశస్త్రాలను సిద్ధం చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా సముద్ర తలంలో డ్రాగన్ కు చెమటలు పట్టించేందుకు భారత అమ్ముల పొదిలో స్మార్ట్గా సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో (స్మార్ట్) చేరింది. సముద్ర అంతర్భాగంలో నక్కి ఉన్న చైనా, శత్రుదేశాల సబ్ మెరైన్లను కనిపెట్టి ధ్వంసం చేసే స్మార్ట్ను ఒడిశాలోని స్పేస్ సెంటర్ నుంచి డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. హిందూ మహాసముద్రంలో నక్కి ఉన్న చైనా దళాలకు చెక్ పెట్టే దిశగా భారత్ తాజాగా జరిపిన ప్రయోగం విజయవంతమైందని రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. శత్రువుల సబ్‌మెరైన్లను ఎదుర్కొనే యాంటీ సబ్‌మెరైన్ వ్యవస్థను రూపొందించే దిశగా ఇది కీలకమైన మలుపు అని అన్నారు.

సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో (స్మార్ట్) పేరిట ఈ ఆయుధ వ్యవస్థను డీఆర్డీఓ రూపొందించింది. సబ్ మెరైన్ ల ద్వారా జరిగే దాడులను నియంత్రించి, శత్రువుల సబ్ మెరైన్లపై ఆధిపత్యం పొందేందుకు కీలకమైన టార్పిడోను డీఆర్డీఓ రూపొందించింది. బాలిస్టిక్ మిసైల్, టార్పిడోలు కలిపి స్మార్ట్‌గా రూపాంతరం చెందాయి. సముద్ర జలాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే స్మార్ట్… 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాలను ఛేదిస్తుంది.

స్మార్ట్ క్షిపణిని యుద్ద నౌకల నుంచి గానీ, సముద్రం ఒడ్డున ఉంచిన ట్రక్ పై నుంచి గానీ ప్రయోగించవచచు. సముద్రంలో దాగి ఉన్న సబ్ మెరైన్ల గుట్టు కనుగొనేంత వరకు గాలిలో ప్రయాణించే స్మార్ట్….సబ్ మెరైన్ జాడ కనిపెట్టగానే సముద్రగర్భంలోకి చొచ్చుకుపోయి టార్పిడో ద్వారా శత్రువుల సబ్ మెరైన్ పై క్షణాల్లో దాడి చేసి ధ్వంసం చేస్తుంది. అతి సమీపంగా వెళ్ళే వరకు శత్రు సబ్ మెరైన్లు ఈ టార్పిడోను గుర్తించకుండా స్మార్ట్ ను రూపొందించారు. అమెరికా, రష్యా, చైనాల తర్వాత ఈరకమైన ఆయుధ వ్యవస్థ కలిగిన దేశం భారత్ కావడం విశేషం. చైనా దగ్గరున్న టార్పిడోల సామర్థ్యం కన్నా భారత్ రూపొందించిన స్మార్ట్ టార్పిడో సామర్థ్యం చాలా ఎక్కువ. ప్రధాని మోడీ సూచన ప్రకారం యాంటి సబ్ మెరైన్ వ్యవస్థకు డీఆర్డీఓ రూపకల్పన చేస్తోంది. ఈ దిశగా చేపట్టిన ప్రయోగాల్లో స్మార్ట్ విజయవంతం అయింది.