సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్ పవర్ కొనుగోలు వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం, అదానీపై అమెరికాలో పెట్టిన కేసుకు ఏపీతో లింకులున్నాయని ప్రచారం జరగడం షాకింగ్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితిని జగన్ తెచ్చాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఏపీ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించారని, వింటేనే బాధగా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో అదానీపై వేసిన కేసు పబ్లిక్ డొమైన్ లో ఉందని, దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. వాస్తవాలు వచ్చిన తర్వాత ఏం చేయాలో చేస్తూనే సభ్యులకు, ప్రజలకు సమాచారం ఇస్తుంటామని అన్నారు.
ఎవరు తప్పు చేసినా వారిపై చర్యలు తప్పవని, అప్పుడే ఇంకొకరు ఇలా చేయకుండా భయపడే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని అన్నారు.
ఐదేళ్ల జగన్ పాలనలో వ్యవస్థలను ధ్వంసం చేశారని, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని మండిపడ్డారు. అసత్యాలను పదే పదే చెప్పి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని గత ప్రభుత్వం పని చేసిందని, వాస్తవాలు పక్కనపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు.
బరితగించి తప్పులు చేసి వాటిని ఒప్పులుగా చిత్రీకరించారని వైసీపీ నేతలపై షాకింగ్ ఆరోపణలు చేశారు. అందుకే విజన్ డాక్యుమెంట్ -2047పేరుతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. రౌడీ రాజకీయాలు చేస్తామంటే పెట్టుబడిదారులు రాష్ట్రానికి రారని చంద్రబాబు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates