అమరావతి..జగన్ ‘కంప’ఇస్తే చంద్రబాబు ‘సంపద’ ఇచ్చారు

వైసీపీ హయాంలో అమరావతిని జగన్ అడవిగా మార్చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కు శ్రీకారం చుట్టింది. దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదల తొలగింపును యుద్ధప్రాతిపదికన చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ ముళ్ల కంపలను నుగ్గు చేసేందుకు తెచ్చిన ఓ భారీ యంత్రం ఆకట్టుకుంటోంది.

డిసెంబరులో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభించనున్న నేపథ్యంలో భారీ యంత్రాల సాయంతో ముళ్ల కంపల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. ముళ్ల కంపలతో కమ్ముకు పోయిన రోడ్లు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. అయితే, అక్కడ తొలగించిన ముళ్లకంపను వేరే చోటికి తరలించకుండా అధికారులు వినూత్న పద్ధతిలో దానిని నుగ్గు చేస్తున్నారు. చెన్నై నుంచి తెచ్చిన ఓ భారీ యంత్రం సాయంతో తొలగించిన కంపను నుగ్గు నుగ్గు చేస్తున్నారు.

అంతేకాదు, ఆ నుగ్గు వేస్ట్ కాకుండా సిమెంట్ కంపెనీల బాయిలర్లు, ఎనర్జీ ప్లాంట్లు, ఇటుక బట్టీలలో వినియోగించేలా దానిని అమ్మేస్తున్నారు. ఈ క్రమంలోనే చెత్త నుంచి సంపద సృష్టిస్తానన్న సీఎం చంద్రబాబు మాటలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ మాదిరిగానే జగన్ ముళ్ల కంపలతో అమరావతిని అడవి చేస్తే…చంద్రబాబు ఆ ముళ్లను నుగ్గు చేసి అమరావతికి ఆదాయం తెచ్చిపెట్టారని ప్రశంసిస్తున్నారు. విజనరీ లీడర్ కు విధ్వంసకర నేతకు ఉన్న తేడా ఇదని అంటున్నారు.

కాగా, జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత విజయవాడ నుంచి అమరావతిలోకి ప్రవేశించే కరకట్ట రోడ్డు, అత్యంత ప్రధానమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, హైకోర్టు నుంచి తుళ్లూరుకు వెళ్లే రోడ్డు, అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించిన రోడ్లు, ఐఏఎస్‌ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు మునుపటి కళను సంతరించుకున్నాయి.