ఓ వైపు కరోనా కలకలం కొనసాగుతున్న్పటికీ….ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు తన నిర్ణయాల పరంపర కొనసాగిస్తోంది. కీలకమైన నియామకాలు, నిర్ణయాలతో ముఖ్యమంత్రి జగన్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలాంటి ఓ నిర్ణయం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.
అయితే, సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఖుష్ చేస్తుందంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం జగన్ సర్కారు వెలువరించిన ఆదేశాల గురించే ఈ చర్చ.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ధరించే యూనిఫాం రంగును మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6 -10వ తరగతి చదివే విద్యార్థులకు గులాబీ రంగు యూనిఫాంను అమలు చేయనున్నారు.
ఇప్పటి వరకు తెలుపు, నీలం, ముదురు నీలం రంగు బట్టలు ధరిస్తున్న విద్యార్థులు.. వచ్చే విద్యాసంవత్సరంలో గులాబీ రంగులో మెరిసిపోనున్నారు. బాలురకు ప్యాంట్, షర్ట్, బాలికలకు పంజాబీ డ్రెస్ ఇస్తామని, విద్యార్థులకు పంపిణీ చేసే బట్టల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఏపీ విద్యా శాఖ స్పష్టం చేసింది.
కాగా, ఏపీ సీఎం, తెలంగాణ సీఎం కేసీఆర్‌ల మధ్య గత కొద్దికాలంగా సఖ్యత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రంగు గులాబీ అనే సంగతి తెలిసిందే. కాకతాళీయమో లేక మరే కారణమైన అయి ఉండవచ్చు కానీ..జగన్ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఈ ఇద్దరి దోస్తీని ప్రస్తావించేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.