జీ20 సదస్సు సందర్భంగా బ్రెజిల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్‌తో కీలక సమావేశం జరిగింది. ఈ చర్చలో ప్రధానంగా ఆర్థిక నేరగాళ్లపై దృష్టి పెట్టిన మోదీ, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ తదితరులను భారత్‌కు అప్పగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా కాలంగా వారిని భారత్ కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ న్యాయపరమైన లుసుగులతో వారు అక్కడే ఉంటున్నారు.
ఇక మోడీ ఈసారి అలాంటి వారిపై మరింత ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జీ20 సదస్సులో ఇదే విషయాన్ని ఆయన బలంగా చెప్పారు. ఆర్థిక నేరగాళ్లను రప్పించడం భారత్ ప్రాధాన్యతగా భావిస్తోందని, దీనిపై అంతర్జాతీయ వేదికల్లో చర్చలు జరుపుతున్నట్లు మోదీ స్పష్టం చేశారు. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ భండారి తదితరులను కూడా భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13,000 కోట్ల మేర మోసం చేసి 2018లో లండన్‌లో తలదాచుకున్నాడు. బ్రిటన్ తన దేశంలో అతని ఉనికిని అంగీకరించినప్పటి నుంచీ, నీరవ్‌ను భారత్‌కు అప్పగించే ప్రక్రియ న్యాయపరమైన సమస్యల వల్ల వేగం అందుకోలేకపోతోంది.
విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల బ్యాంక్ రుణాలను ఎగవేసి 2016లో లండన్‌కు పారిపోయాడు. అతనిపై అరెస్టు వారెంట్లు జారీ అయినప్పటికీ, ఇప్పటి వరకు భారత్‌కు అప్పగించబడలేదు.
ఇటీవల, బ్రిటన్ కోర్టు నీరవ్ మోదీ అప్పగింత పిటిషన్‌ను కొట్టివేసింది. అయినప్పటికీ, బ్రిటన్ ప్రభుత్వం భారత అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ సహాయసహకారాలు అందించడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే న్యాయ ప్రక్రియల క్లిష్టత, నేరపూరిత కేసుల పరిశీలన ఈ ప్రక్రియను మరింత ఆలస్యం చేస్తోంది. మాజీ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా మాల్యా, నీరవ్‌ల కేసులను ప్రస్తావిస్తూ, నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తమ దేశాల్లో తలదాచుకోవడం సరికాదని, వారిని భారత్‌కు పంపించేందుకు తమ దేశం సహకరిస్తుందని గతంలో ప్రకటించారు. అయితే న్యాయ వ్యవస్థ స్వతంత్రతను గుర్తిస్తూ, ఇందుకు సమయం పడుతుందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates