తెలంగాణ రాజకీయాలను మూసీ నది సుందరీకరణ వ్యవహారం కుదిపేస్తోంది. దేవుడే దిగి వచ్చినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది సుందరీకరణ పనులు కొనసాగించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలోనే హైడ్రాకు మరిన్ని పదునైన ఆయుధాలు అందించారు. అయితే.. మూసీ సుందరీకరణకు ఓకేగానే ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం హైడ్రా దూకుడుకు మాత్రం వ్యతిరే కంగా ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.
బీఆర్ ఎస్ పార్టీ నేతలు ఒకవైపు.. బీజేపీ నాయకులు మరోవైపు.. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారును పేదలకు వ్యతిరేకం అనే కోణంలో చూపిస్తున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి కూడా.. మూసీ సుందరీకరణ పనుల వ్యవహారాన్ని మొదట్లో ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యారనే చెప్పాలి. దీంతో రేవంత్ రెడ్డిప్రభుత్వం అంటే.. కూల్చివేతల సర్కారుగా ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు బీజేపీ నాయకులు.. కేంద్ర మంత్రులు మూసీ నిద్ర
పేరుతో హడావుడి చేశారు.
శనివారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సహా ఇతర సీనియర్ నాయకులు పలు ప్రాంతాల్లో నిద్రించారు. అనంతరం.. ఇక్కడి ప్రజలతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కారు పేదలపై యుద్ధం చేస్తోంద ని.. వారి ఇళ్లను కూల్చివేస్తోందని విమర్శించారు. ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పా రు.
ఎప్పుడు ఎవరి ఇల్లు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే 10 మంది గుండె పోటు తో మృతి చెందారన్నారు. ప్రజాపాలన అంటే ఇళ్లు కూలగొట్టడమా? అని నిలదీశారు. మరోవైపు బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇతదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే.. చిత్రంగా మూసీ నది సుందరీకరణకు మాత్రం అందరూ ఓకే చెబుతున్నారు. అయితే.. ఆక్రమణల విషయంలో మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుండడం రాజకీయంగా రచ్చకు దారి తీసింది.