ఏపీ శాసన మండలి ఐదో రోజు సమావేశాలు హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అవుతూనే .. రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో చైర్మన్ మోషేన్ రాజు శాంతి భద్రలపై చర్చకు ఓకే చెప్పారు. తొలుత మాట్లాడిన వైసీపీ మండలి పక్ష నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.. కూటమి ప్రభుత్వం వచ్చాక వీధికో రౌడీ తయారయ్యారని, మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాల్లోనే పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని బొత్స తెలిపారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. హోం మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. సొంత చెల్లి, తల్లికి కూడా రక్షణ లేకుండా చేశారంటూ.. మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. కూటమి ప్రభుత్వం జగన్ తల్లికి, చెల్లికి కూడా అండగా నిలుస్తుందన్నారు.
అంతేకాదు.. చట్టబద్ధత లేని దిశ చట్టాన్ని తీసుకువచ్చి కాలం గడిపేశారని, జగన్ ఇంటి పక్కనే ఓమహిళ పై అత్యాచారం చేసి, హత్య చేస్తే.. కనీసం పట్టించుకున్న నాథుడు కూడా కనిపించలేదని దుయ్యబట్టా రు. దేశంలో మహిళల రక్షణ కోసం నిర్భయ చట్టం ఉండగా.. కొత్త దిశ అనేపేరుతో ఎలాంటి చట్ట బద్ధతా లేని చట్టాన్ని తీసుకువచ్చారని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు. గతంలో ఎవరు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు.
బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన తనపైనే కేసులు పెట్టారని ఇలాంటి జగన్ తాలూకు సభ్యులు కూటమి సర్కారును ప్రశ్నించడం ఏంటని విరుచుకుపడ్డారు. జగన్ హయాంలో జరిగిన మహిళలపై దారుణాలను పుస్తకాల రూపంలో రాసినా సరిపోవన్నారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులువిభేదించారు. అనిత వ్యాఖ్యలను బొత్స సత్యానారాయణ తప్పుబడుతూ.. సభ నుంచి వాకౌట్ చేస్తుసన్నట్టు ప్రకటించి.. సభ్యులు అందరూ వెళ్లిపోయారు.