చంద్ర‌బాబు సోద‌రుడి క‌న్నుమూత‌… బాబు ఇంట తీవ్ర విషాదం

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్ర‌బాబు నాయుడు సోద‌రుడు రామ్మూర్తి నాయుడు మృత్యువుకు చేరువ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు క‌న్నుమూశార‌ని, అయితే, ఇప్పటి వరకు ఆసుపత్రి వర్గాలు, కుటుంబ సభ్యులు అధికారికంగా ధ్రువీకరించలేద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, చంద్రబాబు నాయుడు మరి కొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనుండ‌గా మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.

చంద్ర‌బాబు నాయుడు సోద‌రుడు రామ్మూర్తి నాయుడు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో రామ్మూర్తి నాయుడికి చికిత్స జ‌రుగుతోంది. అయితే, తాజాగా ఆయ‌న ఆరోగ్యం క్షీణించింద‌ని కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందింది. దీంతో వారు ఆస్ప‌త్రికి చేరుకున్నారు. అయితే మ‌రోవైపు రామ్మూర్తినాయుడు క‌న్నుమూశార‌ని పేర్కొంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే మిగిలింద‌ని అంటున్నారు.

కాగా, సోద‌రుడు రామ్మూర్తినాయుడి ఆరోగ్య ప‌రిస్థితి తెలిసిన అనంత‌రం ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు త‌దుప‌రి కార్య‌క్ర‌మాల‌న్నింటినీ ర‌ద్దు చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్న చంద్రబాబు ఈ మేర‌కు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హైద‌రాబాద్ బ‌య‌ల్దేరారు. దీంతోపాటుగా మంత్రి లోకేష్ హైదరాబాద్ కు బయలుదేరారు. రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతున్న ఆస్ప‌త్రి వ‌ద్ద ఆయ‌న త‌న‌యుడు నారా రోహిత్‌, కుటుంబ స‌భ్యులు ఉన్నారు.

నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో సంతానం నారా రామ్మూర్తినాయుడు. 1952లో జన్మించిన రామ్మూర్తినాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. రామ్మూర్తి నాయుడి ఇద్దరు సంతానంలో ఒకరు హీరో రోహిత్‌ కాగా.. మరొకరు నారా గిరీష్.