అవినాష్‌రెడ్డికి మ‌రో చిక్కు.. ఇక‌, బీటెక్ రెడ్డి వంతు!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్ప‌టికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒక‌వైపు బాబాయి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. ప్ర‌స్తుతం బెయిల్‌పైనే కాలం గ‌డుపుతున్నారు.ఇక‌, ఆయ‌న ప్రోత్స‌హించిన‌ట్టు చెబుతున్న కొంద‌రు వైసీపీ సానుభూతి ప‌రులు సోష‌ల్ మీడియాలో విశృంఖ‌లంగా కామెంట్లు చేశారు. వీరిని ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. కీల‌క‌మైన అవినాష్‌రెడ్డి పీఏ కోసం గాలింపును ముమ్మ‌రం చేశారు.

ఇన్ని చిక్కుముడుల మ‌ధ్య అవినాష్ రెడ్డికి ఊప‌రి కూడా తీసుకునే తీరిక‌లేకుండా పోయింది. ఇక‌, ఇప్పు డు టీడీపీ నాయ‌కుడు, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయిన బీటెక్ ర‌వి(ర‌వీంద్రారెడ్డి) రూపంలో మ‌రో చిక్కు ఎదురైంది. తాజాగా బీటెక్ ర‌వి.. అవినాష్ భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డారంటూ.. ఆధారాల తో స‌హా బ‌హిరంగ ప‌రిచారు.  అవినాష్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయ‌న‌ కుటుంబ సభ్యులే తొండూరు మండలంలో 200 ఎకరాల మేర‌కు స‌ర్కారు భూమి ఆక్రమించి సాగు చేశారని చెప్పారు.

అంతేకాదు.. ఈ భూమిని వైసీపీ హ‌యాంలో ఎక‌రా 50 వేల రూపాయ‌ల‌కే అప్ప‌నంగా కొట్టేశార‌ని, అత్యంత త‌క్కువ ధ‌ర‌ల‌కే రేటు నిర్ణ‌యించి రిజిస్ట్రేష‌న్ కూడా చేసుకున్న‌ట్టు బీటెక్ ర‌వి ఆధారాల‌ను వెలికి తీశారు. వీటిపై రాష్ట్ర ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అదేవిధంగా వివేకా కేసులో జైలుకు వెళ్లొచ్చిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి దొడ్ల వాగు గ్రామంలో 30 ఎకరాల భూమిని ఆక్రమించారని కూడా చెప్పారు.

ఇక‌, వైసీపీ నాయ‌కుడు, పులివెందుల మున్సిపల్ చైర్మన్ డికెటి భూములు ఆక్రమించారని బీటెక్ ర‌వి ఆన్‌లైన్ ఆధారాల‌ను బ‌య‌ట‌కు తీశారు. ఇవ‌న్నీ.. ప్ర‌భుత్వ భూములేన‌ని.. నాటి వైసీపీ హ‌యాంలో వీటిని దోచుకున్నార‌ని ఆరోపించారు. వీటి లెక్క‌ల‌న్నీ ప్ర‌భుత్వానికి పంపిస్తామ‌ని.. విచార‌ణ జ‌రిపి.. ఆయా భూములు వెన‌క్కి తీసుకుంటామ‌ని కూడా.. బీటెక్ ర‌వి వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై అవినాష్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.