అనుకున్న దానికన్నా జగన్ ఎక్కువే విధ్వంసం చేశాడు – బాబు

వైసీపీ హ‌యాంలో అనుకున్న దానిక‌న్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువ‌గానే జ‌రిగింద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. రాష్ట్రాన్ని అన్ని ర‌కాలుగా ధ్వంసం చేసింద‌న్నారు. అయితే.. తాము పేప‌ర్ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను బ‌ట్టి విధ్వంసం సాధార‌ణంగానే జ‌రిగింద‌ని అనుకున్నామ‌ని..కానీ, ఇప్పుడు ఒక్కొక్క శాఖ‌ను ప‌రిశీలించి చూడ‌గా.. విధ్వంసం దారుణంగా ఉంద‌న్నారు. విధ్వంసం-అరాచ‌కం-రాక్ష‌స పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని చెప్పారు.

పున‌ర్నిర్మాణానికి ప్రాధాన్యం..

రాష్ట్రం అప్పుల్లో ఉంద‌ని.. దాదాపు 15 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశార‌ని.. అలాంటి రాష్ట్రాన్ని మీరు సీఎం అయి ఏం చేస్తార‌ని త‌న‌ను చాలా మంది ప్ర‌శ్నించిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. అయితే, రాష్ట్రాన్ని పున‌ర్నిర్మించేందుకు.. తాను కృషి చేస్తాన‌ని చెప్పాన‌ని, పున‌ర్నిర్మాణం చేసే క్ర‌మంలో తాను పారిపోన‌ని చెప్పారు. గ‌త వైసీపీ విధ్వంసం.. ఇలా ఉంటుంద‌ని తాను క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌న్నారు. ఎక్క‌డ చూసినా ఎవ‌రికి దొరికింది వారు దోచుకున్నార‌ని తెలిపారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను సైతం నాశ‌నం చేశార‌ని వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌జాధ‌నాన్ని దుబారా చేశార‌ని అన్నారు. వ్య‌వ‌స్థ‌లు మొత్తం నిర్వీర్యం అయిపోయానన్నారు. ఐదేళ్లలో చేసిన అప్పులు-త‌ప్పులు.. రాష్ట్రాన్ని నాశ‌నం చేశాయ‌న్నారు. అభివృద్ధినిరోధ‌క నిర్ణ‌యాలు.. అస‌మ‌ర్థ నిర్వ‌హ‌ణ వంటివి రాష్ట్రానికి ఎప్పుడూ జ‌ర‌గ‌ని న‌ష్టం జ‌రిగేలా చేశాయ‌న్నారు. దోచుకునేందుకే ప‌థ‌కాలు తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. ప్ర‌తివిష‌యంలోనూ గోప్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని తెలిపారు.

క‌నీసం కాగ్‌(సీఏజీ) అడిగినా కూడా లెక్క‌లు చెప్ప‌లేద‌ని వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అనేక సంద‌ర్భాల్లో ప‌లు శాఖ‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసి.. వైట్ పేప‌ర్ ఇవ్వాల‌ని అడిగితే కేసులు పెట్టించా రే త‌ప్ప‌.. త‌మ‌కు కానీ.. ప్ర‌జ‌ల‌కు కానీ స‌మాధానం చెప్ప‌లేద‌న్నారు. ఇలాంటి పాల‌న కూడా ఒక‌టి ఉంటుందా? అని 40 ఏళ్ల అనుభ‌వం త‌న‌కే ఆశ్చ‌ర్యం వేసింద‌న్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారాన్ని ప్ర‌జ‌ల కోస‌మే వినియోగిస్తామ‌ని వివ‌రించారు. ఈ మేర‌కు స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు.