ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ గ్రామంలో యువతిపై జరిగిన హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. పొలం పనులు చేసుకుంటున్న ఓ దళిత యువతిపై నలుగురు యువకులు అత్యాచారం చేసి తర్వాత హత్య చేసిన ఘటన వెలుగు చూడగానే స్ధానికంగా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దళిత యువతికి జరిగిన అన్యాయంపై ఊరిలోని వాళ్ళు ఏకమై గొడవ చేయటంతోనే రాజకీయపార్టీలు ఎంటర్ అయ్యాయి. ఇదే విషయమై బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్ళిన కాంగ్రెస్ కీలక నేతలు రాహూల్ గాంధి, ప్రియాంక గాంధీలపై పోలీసుల ఓవర్ యాక్షన్ తో ఘటనకు దేశవ్యాప్తంగా ప్రచారం వచ్చింది.
ఇది సరిపోదన్నట్లుగా గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్ళిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపిలపై అక్కడి పోలీసులు లాఠీచార్జి జరపటంతో ఒక్కసారిగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మొదలయిపోయాయి. ఈ గొడవ సరిపోదన్నట్లుగా హత్యాచార ఘటనపై అడిషినల్ డీజీపీ మాట్లాడుతూ యువతికి దాడి జరిగిందే కానీ అత్యాచారం జరగలేదన్నారు. మృతదేహాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు అత్యాచారం జరగలేదంటు ఇచ్చిన రిపోర్టును అడిషినల్ డీజీపీ చదివి వినిపించారు. దాంతో నిందుతులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందంటూ బాధిత కుటుంబానికి అండగా ఉంటున్న వర్గాలన్నీ ఒక్కసారిగా రెచ్చిపోయాయి.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే గ్రామంలోకి బయటవారిని ఎవరినీ ఎంటర్ కానీకుండా పోలీసులు మొత్తం గ్రామం చుట్టూతా బ్యారికేడ్లు పెట్టేశారు. ఇదే సమయంలో గ్రామంలో కూడా అందరు ఒకచోట గుమికూడదకుండా 144 సెక్షన్ విధించారు. పోలీసులు చేస్తున్న ఇటువంటి చర్యల వల్ల గొడవలు మరింతగా పెరుగుతున్నాయే కానీ తగ్గటం లేదు. హథ్రస్ ఘటనకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆమధ్య ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన విషయంలో ఉద్రేకాలు మొదలైనట్లు ఇఫుడు కూడా ఉద్రిక్తతలు పెరిగిపోతోంది.
బాధిత కుటుంబానికి అండగా దళితులు, దళిత సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు, స్వచ్చంద సంస్ధలు అన్నీ ఏకమైపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టేశాయి. ఘటనలను కవర్ చేయటానికి వెళ్ళిన మీడియా మీద కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించటంతో గ్రామంలో ఏమి జరుగుతోందో స్పష్టంగా ఎవరికీ తెలియటం లేదు. ప్రభుత్వ యాక్షన్ కారణంగా ఘటనను నీరుగార్చేందుకు ప్రయత్నాలు మొదలైపోయినట్లుగా అందరు అనుమానిస్తున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్, ప్రభుత్వం చర్యల కారణంగా దేశవ్యాప్తంగా హథ్రస్ ఘటనకు మద్దతు పెరిగిపోతోంది. మరి ఈ వ్యతిరేకతను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.