పిఠాపురంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలను అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా? వైసీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీశాఖా మంత్రిని అని… పరిస్థితి చేయిదాటితే హోం శాఖను తాను తీసుకుంటానని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఒకవేళ తన హోం శాఖని తాను తీసుకుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగా వ్యవహరిస్తానని, డిప్యూటీ సీఎం పదవి పోయినా ప్రజల కోసం పోరాడేందుకు సిద్ధమని పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. ఇళ్లలోకి వచ్చి రేప్ చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పవన్ ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ అధికారులకు చెబుతున్నాను..బయటకు వస్తే మమ్మల్ని తిడుతున్నారు…అంటూ పవన్ ఎమోషనల్ అయ్యారు.
పోలీస్ అధికారులకు, డిజిపి, ఇంటెలిజెన్స్ అధికారులు అందరికీ చెప్తున్నానని, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మూడేళ్ల ఆడబిడ్డను రేప్ చేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా అంటూ పోలీస్ అధికారులపై పవన్ ఫైర్ అయ్యారు. ఇండియన్ పీనల్ కోడ్… క్రిమినల్ ను వెనకేసుకు రమ్మని చెప్పడం లేదని, పోలీసు అధికారులు మారాలని పవన్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి లా అండ్ ఆర్డర్ బలంగా అమలు చేయాలని తాను చెబుతున్నానని అన్నారు.
గతంలో గరుడ అనే ఒక ఎస్పీ ప్రజలకు అభివాదం చేస్తున్న తనను కూర్చొవాలని భయపెట్టే ప్రయత్నం చేశారని, అటువంటిది రేపిస్టులను పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఒక ముఖ్యమంత్రిని చంపేస్తాను అంటూ బెదిరించారని, అటువంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పవన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో శాంతిభద్రతల నియంత్రణ లేదని, ఇప్పుడు ధర్మబద్ధంగా శాంతిభద్రతలు అమలు చేయాలని కోరుతుంటే మీనమేషాలు లెక్కిస్తున్నారని పోలీసుల తీరుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏదేమైనా, హోం శాఖను తాను తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని, పోలీసులు సరిగా శాంతిభద్రతలను పరిరక్షించడం లేదని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, పోలీసు ఉన్నతాధికారుల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates