కొత్త ఇల్లు కట్టుకోవడానికి ముందు పంచాయతీ లేదా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి. తగిన బ్లూ ప్రింట్ లేఅవుట్ ను అధికారులు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే గృహ నిర్మాణాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఒక సెంటు….రెండు సెంట్లలో చిన్న ఇల్లు నిర్మించుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ ప్రక్రియ ఇబ్బందికరంగా మారింది. అనుమతుల కోసం కార్యాలయం చుట్టూ తిరగడం ఒక ఎత్తయితే, దాని మార్కెట్ విలువను బట్టి ఫీజు కింద నగదు చెల్లించడం మరొక ఎత్తు.
ఈ నేపథ్యంలోనే పేద, మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఏపీ ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి గృహ నిర్మాణదారులకు మంత్రి పొంగూరు నారాయణ తీపి కబురు చెప్పారు. నగరాల్లో 100 గజాల్లోపు నిర్మించే ఇళ్లకు టౌన్ ప్లానింగ్ మంజూరు ప్రక్రియను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని నారాయణ ప్రకటించారు. 2 సెంట్ల లోపు ఇల్లు నిర్మించుకునేవారు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ కోసం తిరగాల్సిన పనిలేదని తెలిపారు.
పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు తొలగించేలాగా భవన నిర్మాణానికి అనుమతుల విధానాలను సరళీకరించామని చెప్పారు. అందుకోసం తగిన నిర్ణయాలు తీసుకుంటామని నారాయణ చెప్పారు. దాంతో పాటు 300 గజాల లోపు ఇళ్లకు సులభంగా టౌన్ ప్లానింగ్ అప్రూవల్ వచ్చేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వివిధ అంశాలపై అధికారులతో చర్చించిన మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates