సనాతన ధర్మ పరిరక్షణ కోసం.. జనసేన పార్టీలో ప్రత్యేక విభాగాన్ని(స్పెషల్ వింగ్) ఏర్పాటు చేస్తున్నట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘నరసింహ వారాహి గణం’ పేరుతో జనసేనలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని అనుకునేవారు ఈ విభాగంలో ఉంటారని తెలిపారు. ఈ బృందంలో ఉన్నవారు ఆలయాల రక్షణతో పాటు భక్తుల మనోభావాల పరిరక్షకులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు గత వైసీపీ ప్రభుత్వంలో చిత్తు కాయితాల మాదిరిగా తయారయ్యాయని.. నేతలు.. కనీసం హిందువులను పట్టించుకోలేదని అన్నా రు.
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం.. స్తానిక నరసింహ క్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు జనసేన కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే.. ఇతర మతాలకు తాను కానీ, జనసేన కానీ వ్యతిరేకం కాదని తెలిపారు. ఇతర మతాలను కూడా గౌరవిస్తామని చెప్పారు. “అన్ని మతాలకు గౌరవం ఇవ్వాలి..మతాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చర్యలు తప్పవు” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు ‘ఓజీ’ సినిమాపై నినాదాలు చేశారు. ఈనేపథ్యంలో పవన్ కల్యాణ్ చిరాకు ప్రదర్శించారు. “సరదా కోసం సినిమా ఉండాలి. కానీ, ఆ సినిమా చూడాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండాలి. సినిమా పేర్లతో అరిచే బదులు భగవంతుని నామస్మరణ చేయండి. దేవుడిని తలుచుకుంటే.. అద్భుతాలు జరుగుతాయి” అని వ్యాఖ్యానించారు. భక్తులకు అండగా నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతగా ఉండాలనేది తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విషయంలో పార్టీ కూడా నిబద్ధతతో ఉందని తెలిపారు. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రమయింది కాబట్టే..తాను దీక్ష చేపట్టినట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates