దీపావళి సందర్భంగా దీపం-2 పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళంలో చంద్రబాబు ఆ పథకం మొదలుబెట్టగా, ఏలూరు జిల్లాలో ఈ పథకం ప్రారంభోత్సవం తర్వాత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ నోళ్లు లెగుస్తున్నాయని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతామని పవన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తొక్కి పట్టి నారతీస్తానని హెచ్చరించారు. భవిష్యత్తులో వైసీపీ నేతల నోళ్లు లేవకుండా చేస్తానని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తమది మంచి ప్రభుత్వమే గానీ, మెతక ప్రభుత్వం కాదని, యుద్ధం కావాలంటే మంచి పాలనతో యుద్ధమే ఇస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ దోపిడీ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, అందుకే వారిని తరిమికొట్టినా వాళ్ళ నోళ్లు మూతపడడం లేదని పవన్ అన్నారు. సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఆడపిల్లలను ఇబ్బంది పెట్టేలాగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
ఆడబిడ్డల మానప్రాణాలకు ఇబ్బంది కలగకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని, ఆడపిల్లల గురించి అసహ్యంగా తాము మాట్లాడలేదని పవన్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం పథకాల సరిగా అమలు చేయలేదని పవన్ అన్నారు. హామీలు అమలు కాకుంటే జన సైనికుల ప్రేమ ఎంత బలంగా ఉంటుందో కోపం కూడా అంతే బలంగా ఉంటుందని, పదవి వచ్చిన తర్వాత పదింతలు ఎక్కువగా కష్టపడే వ్యక్తిని తాను అని చెప్పారు.
ఇక, తనకు ప్రాణహాని ఉందని షర్మిల దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం తప్పకుండా ఆమెకు రక్షణ కల్పిస్తుందని చెప్పుకొచ్చారు. అమ్మా షర్మిల మీ అన్న రక్షణ కల్పించలేకపోయాడు..కానీ, మీకు ఈ కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుంది అని పవన్ అన్నారు. బాధ్యత గల నాయకురాలిగా విమర్శలు చేయొచ్చని, కానీ ప్రాణహాని ఉందంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి షర్మిలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates