తెలంగాణలో మద్యం ధరలు పైపైకి… పద్ధతి మార్చిన ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మద్యం ధరలకు సమానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మద్యం ధరలు పెరగనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. త్వరలోనే బీరు పై రూ.20, లిక్కర్ క్వార్టర్‌ పై రూ.20 నుంచి రూ.70 వరకు ధర పెంపు చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. మద్యం ధరలు పెరగడం వల్ల ప్రతి నెల రూ.1000 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ శాఖ ద్వారా ప్రభుత్వం వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీల రూపంలో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొదటి ఆరు నెలల్లో ఎక్సైజ్‌ శాఖకు ఎక్సైజ్‌ డ్యూటీ ద్వారా రూ.9,493 కోట్లు, వ్యాట్‌ ద్వారా రూ.8,040 కోట్లు వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి. అంటే, మొత్తం రూ.17,533 కోట్ల ఆదాయం నమోదు అయ్యింది. మిగతా ఆరు నెలల్లో కూడా ఇదే విధంగా ఆదాయం వస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.35,000 కోట్లకు మించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

గత కొంతకాలంగా ఎక్సైజ్‌ శాఖ ద్వారా రాష్ట్రానికి ఆశించినంత ఆదాయం రావడం లేదు. అదనంగా, గుడుంబా మరియు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరిగాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సర్వేలో గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అక్రమ మద్యం వ్యాపారం గణనీయంగా పెరిగినట్లు సూచిస్తోంది. ఇక ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖను గుడుంబా వ్యాపారాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.