ముద్రగడ పద్మనాభం. సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమాన్ని ఒంటిచేత్తో ముందుకు నడిపించిన పేరు కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికీ.. ఉన్నారో.. లేదో తెలియనంతగా ఆయన వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం.. ఆయన అన్యమనస్కంగానే వైసీపీలో చేరారు. పెద్ద ఉత్సాహంగా అయితే.. చేరలేదు. పైగా వైసీపీ అధినేత.. జగన్ పెట్టిన టార్గెట్(పవన్‌ను ఓడించడం) ను కూడా ఆయన పూర్తి చేయలేకపోయారు. దీంతో అధినేత నుంచి కనుచూపు కరువైంది.
ఇదిలావుంటే.. అసలు ముద్రగడ ఇష్టాయిష్టంగా అయినా.. వైసీపీ బాట పట్టడానికి కారణం.. ఆయన కుమారుడికి భవిష్యత్తు కోసమే. కానీ, ఇప్పుడు వైసీపీ భవిష్యత్తే అంధకారంలో ఉండడంతో ఆయన కుమారుడు గిరి భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది. సో.. ఈ నేపథ్యంలోనే ముద్రగడ మౌనంగా ఉన్నారన్నది ఒక వర్గం చెబుతున్న మాట. మరో వర్గం.. దీనికి భిన్నంగా వాదిస్తోంది. అసలు గిరికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని.. ఏదో తండ్రి మాటకు ఎదురుచెప్పలేక ఆయన వచ్చారని అంటున్నారు.
మొత్తంగా.. ముద్రగడ వారసుడి రాజకీయం అయితే.. ప్రస్తుతం తర్జన భర్జనగానే ఉంది. ఇదిలావుంటే.. తండ్రిని ఎదిరించిందన్న పేరు తెచ్చుకున్నప్పటికీ.. ముద్రగడ కుమార్తె.. క్రాంతి, ఆమె భర్తతో కలిసి. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్లు ఈ విషయం రగడగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు తండ్రీకుమార్తెలు కూడా రాజకీయ పోరు సల్పుకున్నారు. అయినా.. క్రాంతి వెనక్కి తగ్గకుండా.. జనసేనలోకి చేరారు.
త్వరలోనే ఆమెకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు ఇస్తారని సమాచారం. కుదిరితే.. అంటే.. రాజకీయంగా అవసరాలను బట్టి.. ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఆశ్చర్యం లేదన్న చర్చ సాగుతోంది. ముందుగా అయితే.. రాష్ట్ర వీరమహిళ విభాగానికి ఆమెను అధ్యక్షురాలిని చేయనున్నట్టు సమాచారం. ఈ రెండు ఖాయమని కూడా చెబుతున్నారు. మరోవైపు కాపుల్లోనూ క్రాంతి విషయంలో వ్యతిరేకత లేకపోవడం గమనార్హం. దీంతో ఎప్పటికైనా.. ముద్రగడ వారసురాలి రాజకీయమే పుంజుకుంటుందన్నది కాపుల మధ్య జరుగుతున్న చర్చగా ఉంది.