ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం వల్లే అంతటి అసాధారణ విజయం సొంతమైంది. ఈ కలయికకు బీజం పడింది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్నపుడు. అంతకుముందే టీడీపీ, జనసేన కలుస్తాయనే సంకేతాలు ఉన్నప్పటికీ.. బాబును పరామర్శించడానికి వెళ్లినపుడు పవన్ తాము కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో రాజకీయంగా ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. జగన్ పతనం అక్కడే మొదలైందని చెప్పవచ్చు. ఇంతకీ పవన్ ఆ రోజు అంత ఆవేశంగా ఆ ప్రకటన ఎందుకు చేశారు? దానికి ముందు బాబుతో ఆయన ఏం మాట్లాడారు అన్నది ఆసక్తికరం.
ఈ విషయాన్ని బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించే ‘అన్ స్టాపబుల్’ షోలో చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. “నా అరెస్టు కంటే ముందు పవన్ కళ్యాణ్ ఓసారి విశాఖపట్నం వెళ్తే ఆయన్ని అక్కడ దిగనీయకుండా, హోటల్లోనూ ఉండడానికి వీల్లేదంటూ పంపించేశారు. దీంతో ఆయన విజయవాడకు వచ్చారు. ఓ నాయకుడిగా నేనే స్వయంగా వెళ్లి సంఘీభావం తెలియజేశా. అండగా ఉంటానని చెప్పా. ఆ తర్వాత నాకోసం పవన్ హైదరాబాద్ నుంచి రాబోతుండగా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేయించారు. రోడ్డు మార్గంలో వస్తుంటే ఆపేశారు. నన్ను కలవనీయకుండా కట్టడి చేశారు.
జైల్లో ఉన్నపుడు మీరు (బాలకృష్ణ), లోకేష్, పవన్ కలిసి వచ్చారు. పవన్ కళ్యాణ్‌తో నేను రెండు నిమిషాలే మాట్లాడా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకుండా చూస్తానని చెప్పారు. కలిసి పోటీ చేద్దామనే విషయాన్ని నేనే ముందు ప్రస్తావించాననుకుంటా. ఆలోచించి చెప్పమన్నాను. ఆయన ఓకే అన్నారు. భాజపాతో కలిసి పొత్తు తీసుకొస్తామని చెప్పారు. బయటికి వచ్చాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ విషయాన్ని ప్రకటించారు. మన విజయానికి అదే నాంది” అని బాబు వెల్లడించారు. తాను అరెస్టు కాకపోయినా కూటమి ఏర్పాటయ్యేదేమో అని బాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates