వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య ఆస్తుల పంపకాల్లో గొడవల సంగతేమో కానీ.. దీని వల్ల వైఎస్ హయాంలో జరిగిన అవినీతి, దోపిడీ గురించి మరోసారి జనాలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్ లాంటి పథకాల ద్వారా జనాల దృష్టిలో వైఎస్ దేవుడు అయిపోయి ఉండొచ్చు కానీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన్ని మించిన అవినీతి పరుడు లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా కొడుక్కి రాష్ట్రాన్ని దోచి పెట్టేశారని.. ఆయన హయాంలో జగన్ లక్ష కోట్లకు పైగా అవినీతి చేశారని ఆరోపణలు వచ్చాయి.
దీనికి సంబంధించి జగన్ అనేక అవినీతి కేసులనూ ఎదుర్కొంటుండడం.. తండ్రి మరణానంతరం 16 నెలల పాటు జైలు జీవితం కూడా గడపడం.. ఇప్పటికీ బెయిల్ మీదే ఉండడం తెలిసిందే. ఇక సరస్వతి పవర్ సంస్థకు సంబంధించి షేర్ల కేటాయింపులో జగన్, షర్మిళ మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో అసలీ సంస్థ పుట్టు పూర్వోత్తరాలేంటి.. ఇది వేల కోట్ల స్థాయికి ఎలా చేరిందనే విషయమై మీడియాలో మళ్లీ కథనాలు వస్తున్నాయి.
వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లిలో ఎకరానికి రూ.3 లక్షల చొప్పున కారు చౌకగా 1515 ఎకరాలను సరస్వతి పవర్ సంస్థ కోసం జగన్ కొనుగోలు చేశారు జగన్. ఇప్పుడు కేవలం ఆ భూముల విలువే వందల కోట్లకు చేరుకుంది. ఈ భూముల్లో లక్షల టన్నుల సున్నపురాళ్ల నిక్షేపాలు ఉండడం గమనార్హం. ఒక్కో ఎకరాకు 1.70 లక్షల టన్నుల సున్నపురాయి వస్తుందని అంచనా. సున్నుపురాళ్ల గనుల విలువ రూ.10 వేల కోట్లకు పైమాటేనట. ముందు విద్యుదుత్పత్తి కోసం ఏర్పాటు చేసిన సరస్వతి పవర్‌ను తర్వాత సిమెంట్ కంపెనీగా మార్చేశారు. ఈ క్రమంలోనే ఆ సంస్థకు సున్నపురాళ్ల గనుల లీజు దక్కింది.
ఐతే గనుల లీజ్ ముగుస్తున్న దశలో 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. తర్వాత కొన్ని నెలలకే గనుల లీజును పునరిద్ధరించడంతో పాటు లీజు గడువును 50 ఏళ్లకు పెంచుకున్నారు. అంతే కాక సరస్వతి పవర్‌కు కృష్ణా నది నుంచి 0.0689 టీఎంసీల జలాలను కూడా కేటాయించుకున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ కడతామని, ఉపాధి కల్పిస్తామని రైతుల నుంచి భూములు సేకరించారు కానీ.. ఆ పనులేవే చేపట్టలేదు. భూముల విలువ పెంచుకున్నారు. గనుల నిక్షేపాలనూ సొంతం చేసుకున్నారు కానీ.. ఆ ప్రాంత ప్రజలకు ఒనగూరింది ఏమీ లేదు. ఇప్పుడు ఆ సంస్థ షేర్ల పంపిణీలో జగన్, షర్మిళ మధ్య గొడవ తలెత్తి దీని వెనుక ఎంత అవినీతి, అక్రమాలు జరిగాయనే విషయం మీడియా, సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది.