ఒక్క రోజు కేవలం రెండు పాజిటివ్ కేసులు నమోదు కావటం తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆనందానికి కారణంగా మారింది. అందుకేనేమో.. కొద్దిరోజులుగా కామ్ గా ఉంటున్న కేసీఆర్.. వెంటనే ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నోటి వెంట కీలక వ్యాఖ్య ఒకటి వెలువడింది. రానున్న కొద్దిరోజుల్లోనే కరోనా పాజిటివ్ లేని రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని 21 జిల్లాల్లో ఒక్క కరోనా యాక్టివ్ కేసు లేని విధంగా మారుతుందన్న అంచనా ఆయన నోటి నుంచి వచ్చింది. ఇప్పటివరకూ వైరస్ సోకిన వారిలో 97 శాతం మంది రోగులు కోలుకున్నారని చెప్పారు. పలువురు డిశ్చార్జి కావటం మంచి పరిణామంగా అభివర్ణించారు.
వైరస్ వ్యాప్తి తగ్గుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నట్లుగా చెప్పారు. ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అనంతరం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పలువురు మంత్రులతో పాటు.. ప్రభుత్వ కీలక అధికారులు ఈ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కరోనా ఎపిసోడ్ షురూ అయ్యాక తొలిసారి సీఎం కేసీఆర్ అంచనా కరెక్టు అయ్యిందని చెప్పక తప్పదు.
కరోనా మీదా తన అంచనాను చెప్పిన పలు సందర్భాల్లో ఏదో ఒక అవాంతరం ఎదురుకావటం.. కొత్త అంశాలు వెలుగు చూడటంతో పాజిటివ్ కేసుల్ని అనుకున్నంతగా తగ్గించలేని పరిస్థితి. ఆ మధ్యన నిర్వహించిన మీడియా సమావేశంలో ఏప్రిల్ 25 నాటికి అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే.. కొత్త కేసుల సంఖ్య తగ్గుతుందని చెప్పటాన్ని మర్చిపోకూడదు. ఈ సందర్భంలోనే కేంద్ర సర్కారుకు భిన్నంగా మే ఏడు వరకూ లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.
కేసీఆర్ అంచనాకు తగ్గట్లే ఫలితాలు చోటు చేసుకోవటం ఒక పరిణామమైతే.. తక్కువ కేసులు నమోదు కావటం గుడ్ న్యూస్ గా చెప్పాలా? అంటే వెంటనే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే.. అత్యధిక కేసులు బయటపడ్డ సూర్యాపేటకు తెలంగాణ ఆడ్మినిస్ట్రేషన్ బాసులంతా మూకుమ్మడిగా వెళ్లటం.. అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత కేసుల తీవ్రత తగ్గిపోవటంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
కరోనా మీద కేసీఆర్ అంచనా తొలిసారి కరెక్టు అయిందన్న భావన వ్యక్తమవుతున్నా.. అంత త్వరగా ఒక నిర్ణయానికి రావటం ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజులు ఇలాంటి పరిస్థితే కొనసాగితే.. సారు నోటి నుంచి వచ్చినట్లుగా తాజా పరిణామాలు శుభసూచకమని చెప్పక తప్పదు.