బండి సంజ‌య్‌కు కేటీఆర్ లీగ‌ల్ నోటీసులు ఏం జ‌రిగింది?

తెలంగాణ బీజేపీ నాయ‌కుడు, కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌కు.. బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి కేటీఆర్‌.. తాజాగా లీగ‌ల్ నోటీసులు పంపించారు. త‌న ప‌రువుకు భంగం క‌లిగించే వ్యాఖ్య‌లు చేశార‌ని, వారం రోజుల్లో త‌న‌కు బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న కోరారు. లేని పక్షంలో ప‌రువు న‌ష్టం దావా వేయాల్సి ఉంటుంద‌ని నోటీసుల్లో హెచ్చ‌రించారు. ఈ మేర‌కు త‌న న్యాయ‌వాది ద్వారా కేటీఆర్‌.. బండికి లీగ‌ల్ నోటీసులు పంపించారు.

“ఈనెల 19న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నా వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయి” అని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

ఇటీవ‌ల బండి సంజ‌య్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కేటీఆర్‌కు.. కొందరితో సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయ‌డంలోనూ సిద్ధ‌హ‌స్తుడ‌ని పేర్కొన్నారు. అక్కినేని కుటుంబం వివాదం జ‌రుగుతున్న క్ర‌మంలో ఈ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాల్లోనూ కేటీఆర్‌కు సంబంధాలు ఉన్నాయ‌ని మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఈ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లోనే తీవ్ర ర‌గ‌డ‌కు దారి తీశాయి.