ప్ర‌భుత్వం కూట‌మిది.. అధికారం వైసీపీది.. అక్క‌డంతే !!

ఏపీలో ఎవ‌రి ప్ర‌భుత్వం ఉంది? దీనికి త‌డుముకోవాల్సిన అవ‌స‌రం లేదు. బీజేపీ+టీడీపీ+జ‌న‌సేనల కూట‌మి స‌ర్కారు ఉంది. నాలుగు మాసాలుగా పాల‌న కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ప‌లు జిల్లాల్లో కూట‌మి నాయ‌కులు కూడా చెల‌రేగుతున్నారనే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. ఇది ఎక్క‌డైనా చెల్లుతుందేమో.. కొన్ని కొన్ని జిల్లాల్లో మాత్రం ప్ర‌భుత్వం కూట‌మిదే అయినా.. అధికారం అంతా కూడా.. వైసీపీ నాయ‌కుల‌దే అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ఇది చాలా ఆస‌క్తిగా, ఆశ్చ‌ర్యంగా కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆయా జిల్లాల్లో త‌మ్ముళ్లు కూడా స‌ర్దుకుపోతున్నారు. త‌మ‌ది తాము తీసుకుంటున్నారు.

ఎక్క‌డెక్క‌డ‌?

ఏలూరు: ఏలూరులో బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నా.. టీడీపీలో ఐక్య‌త క‌రువైంది. దీంతో వీరిలో వీరు పొట్లాడుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇసుక‌, మ‌ద్యంవిష‌యాల్లో త‌మ్ముళ్ల మ‌ధ్య ఏర్ప‌డిన వివాదాలు.. వైసీపీ నేత‌ల‌కు క‌లిసి వ‌చ్చాయి. వారితో చేతులు క‌లిపి.. వీరు కూడా స‌ర్దుబాటు వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే ఒక నేత‌పై ఆధిప‌త్యం కోసం.. టీడీపీ నేత‌లు వైసీపీ నాయ‌కుల‌తో చేతులు క‌లుపుతున్నారు. దీంతో ఇసుక త‌ర‌లి పోతున్నా.. ప‌ట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇక‌, మ‌ద్యంలోనూ సిండికేట్ల రాజ్యం ఎక్కువ‌గా న‌డిచింది ఈ జిల్లాలోనే న‌ని అంటారు.

క‌ర్నూలు: ఇక్క‌డ రాజ‌కీయాలు మ‌రీ విచిత్రం.. వైసీపీ హ‌యాంలో ఎవ‌రైతే ఆధిపత్యం చ‌లాయించారో.. వారిలో కొంద‌రు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. దీంతో త‌మ్ముళ్ల‌ను మించి ఈ జంపింగులు రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇసుక విష‌యంలో అయితే.. మ‌రీ ఎక్కువ‌గా వైసీపీ నాయ‌కులు చెల‌రేగుతున్నారన్న వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌తంలో అవ‌లంబించిన ఇసుక విధానాన్ని ర‌ద్దు చేసినా.. అప్ప‌ట్లో ఆన్‌లైన్‌లో చేసుకున్న బుకింగుల‌ను ఆధారం చేసుకుని.. ఇప్ప‌టికీ వైసీపీ నాయ‌కులు ఇసుక‌లో వేళ్లు కాళ్లు పెడుతున్నారు. ఇక‌, త‌మ నాయ‌కుడు ఎలానూ త‌మ‌ను వేలు పెట్టొద్ద‌ని హెచ్చ‌రించాడు కాబ‌ట్టి.. కొంద‌రు త‌మ్ముళ్లు లోపాయికారీగా వైసీపీ నేత‌ల‌తో చేతులుక‌లిపి.. ఈ వ్యాపారంలో అంతో ఇంతో వెనుకేసుకుంటున్నారు.

తిరుప‌తి: కీల‌క‌మైన జిల్లాల్లో ముఖ్యంగా వైసీపీనేత‌ల దూకుడు ఎక్కువ‌గా ఉన్న జిల్లాల్లో తిరుప‌తి కూడా ఒక‌టి. ఇక్క‌డ కూడా టీడీపీ పై వైసీపీ నేత‌ల డామినేష‌న్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. శ్రీకాళ‌హ‌స్తి, తిరుప‌తి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మానంగా ఇరు ప‌క్షాల నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్నారు. ఎవ‌రి రూపాయి వారు తీసుకుంటూ.. చాలా క‌లివిడిగా ఉంటున్నారు. ఇక‌, మ‌రికొన్ని చోట్ల మాత్రం.. టీడీపీ నేత‌ల‌దే పైచేయిగా ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. కొన్ని జిల్లాల్లో త‌మ్ముళ్లు-వైసీపీ నేత‌లు క‌లిసి రాజ‌కీయాలు చేస్తే.. మ‌రికొన్ని చోట్ల వైసీపీ దూకుడును త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.