చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి..ఉత్తరాంధ్ర నేతల్లో చర్చ

వైజాగ్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా పశ్చిమ ఎంఎల్ఏ గణబాబును ఎంపిక చేసి చంద్రబాబునాయుడు తప్పు చేశారా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. గణబాబును అధ్యక్షునిగా నియమించ వద్దని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదట.

ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పేమిటి ? ఏమిటంటే గణబాబు టిడిపిని వదిలేసి వైసిపిలో చేరటం ఖాయమని ఎప్పటి నుండో పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే వైసిపి నుండి గ్రీన్ సిగ్నల్ రాని కారణంగానే ఇంకా కంటిన్యు అవుతున్నారట. గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే కండువా మార్చేస్తారని పార్టీలో టాక్.

ఈ మధ్య పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ చేస్తున్న నిరసనల్లో కూడా గణబాబు పాల్గొనటం లేదు. చంద్రబాబు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్సుల్లో కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయటం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. విశాఖపట్నం నగరంలోని నాలుగు ఎంఎల్ఏ నియోజకవర్గాల్లో మొన్నటి ఎన్నికల్లో టిడిపినే గెలుచుకుంది. ఈ నలుగురిలో వాసుపల్లి గణేష్ ఈమధ్యనే వైసిపిలో చేరారు.

మిగిలిన ముగ్గురిలో గంటా శ్రీనివాసరావు వైసిపిలో చేరేందుకు చాలా ప్రయత్నాలు చేసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. తాజాగా గణబాబు విషయంలో కూడా ఇదే ప్రచారం ఊపందుకుంది. మిగిలింది వెలగపూడి రామకృష్ణ మాత్రమే. ఈయనొక్కరే పార్టీ కార్యక్రమాలతో పాటు చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్సుల్లో కూడా కనబడుతున్నారట.

కారణాలు స్పష్టంగా తెలియటం లేదుకానీ గణబాబు పార్టీ మారే విషయం ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతున్నాయట. అక్టోబర్ 5వ తేదీన గణబాబు పార్టీ మారటం ఖాయమని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. విశాఖ పార్లమెంటు అధ్యక్షుడు మాత్రమే కాదు వైజాగ్, శ్రీకాకుళం జిల్లాల సమన్వయకర్త కూడా. ఎంతకాలం టిడిపిలో ఉంటాడో తెలీని ఎంఎల్ఏకి వైజాగ్ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్ష పదవి ఇవ్వద్దని కొందరు నేతలు చంద్రబాబుకు చెప్పినా వినలేదట. ఒకవేళ జరుగుతున్న ప్రచారం ప్రకారమే గణబాబు గనుక పార్టీ మారిపోతే ఏమవుతుంది ? ఏమవుతుంది పార్టీ నుండి మరో ఎంఎల్ఏ వెళ్ళిపోతారంతే. కాకపోతే నాలుగు రోజులు ఎంఎల్ఏ, చంద్రబాబు, టిడిపి గురించి మాట్లాడుకుని తర్వాత అందరు మరచిపోతారని చెప్పుకుంటున్నారు.

కానీ ప్రచారం జరుగుతున్నట్లు నాలుగు రోజుల తర్వాత మరిచిపోవటం చెప్పినంత సులభం కాదు. ఎందుకంటే ఎంఎల్ఏకి స్ధానికంగా క్యాడర్ తో పాటు జనాల్లో కూడా మంచి పట్టుంది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో ఉధృతమైన వైసిపి గాలిని సైతం తట్టుకుని గెలిచారు. ఇటువంటి బలమైన నేత పార్టీని వదిలేసి వెళ్తే కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతుంది. అసలే మొన్నటి ఘోర ఓటమితో పార్టీ కష్టాల్లో ఉంది. దీనిమీద గెలిచిన ఎంఎల్ఏలు కూడా పార్టీని వదిలేస్తే ఇక చెప్పాల్సిన పనేలేదు. ఇందుకే చంద్రబాబు తప్పు చేశాడని పార్టీలో చర్చ జరుగుతోంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)