ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆయన సోమవారం విజయనగరంలో పర్యటించనున్నారు. అయితే.. ఇది తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. వైసీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ.. బొత్స సత్యనారాయణ.. పవన్ పర్యటనను తప్పుబట్టారు. సోమవారం వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ధర్నాకు పిలుపునిచ్చినట్టు తెలిపారు. మరి దీనికి కారణాలేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది.
విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో గత వారం రోజులుగా డయేరియా ప్రబలింది. ఈ క్రమంలో వందల మంది ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారు. 16 మంది వ్యక్తులు మృతి చెందారు. ప్రభుత్వం సకాలంలో స్పందించలేదన్నది విపక్షం వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఇదే విషయాన్ని శనివారం పార్టీ నాయకుల సమావేశంలో మాజీ సీఎం జగన్ కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మద్యం, ఇసుకలో కూరుకుపోయిందని.. ప్రజల ప్రాణాలు పట్టించుకోవడం లేదని అన్నారు.
ఈ క్రమంలోనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ బృందాన్ని గుర్ల గ్రామానికి పంపుతున్నట్టు చెప్పారు. ఇదిలావుంటే.. సోమవారం పవన్ పర్యటనకు రంగం రెడీ అయింది. ఆ గ్రామానికి వెళ్లి స్థానిక పరిస్థితులపై అధికారులతో ఆయన సమీక్షిస్తారు. అయితే.. ఈ పర్యటనను వైసీపీ నేత బొత్స తప్పుపడుతున్నారు. 16 మంది చనిపోయిన తర్వాత.. గుర్ల గ్రామ పరిస్థితి కూటమి సర్కారుకు తెలిసిందా? అని నిలదీశారు.
అంతేకాదు.. డయేరియా మరణాలు సహజ మరణాలు కావని.. కూటమి ప్రభుత్వ అలసత్వం వల్ల సంభవించిన మరణాలని బొత్స ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తక్షణమే పరిహారం చెల్లించాలని బొత్స డిమాండ్ చేశారు. అంతేకాదు.. పవన్ అక్కడకు వెళ్లేప్పుడు.. పరిహారంతోనే అడుగు పెట్టాలని.. చేతులు దులుపుకొని వస్తానంటే కుదరదని చెప్పారు. తమ నాయకులు అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరి దీనిపై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates