సమీక్ష – తిరగబడరా సామీ

1.5/5

1h 55m   |   Action   |   02-08-2024


Cast - Raj Tarun, Malvi Malhotra , Mannara Chopra

Director - A.S. Ravi Kumar Chowdary

Producer - Malkapuram Shivakumar

Banner - Suraksh Entertainment

Music - J.B., Bhole Shavali

గత కొద్దిరోజులుగా గర్ల్ ఫ్రెండ్ కు సంబంధించిన వివాదంలో చిక్కుకున్న హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమాల కబుర్ల కన్నా ఈ కాంట్రవర్సీతోనే ఎక్కువగా వార్తల్లో నలుగుతున్నాడు. గత వారం పురుషోత్తముడుతో పలకరించి పట్టుమని పది రోజులు గడవకుండానే ఈసారి తిరగబడరా సామీ అంటూ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేశాడు. ఒకప్పుడు యజ్ఞం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ మాస్ డ్రామాలో మాన్వీ మల్హోత్రా హీరోయిన్. అంచనాలే లేకుండా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే

కథ

తల్లితండ్రులు బ్రతికే ఉన్నా జాతరలో తప్పిపోయిన గిరి (రాజ్ తరుణ్) అనాథలా పెరిగి తనలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఒంటరిగా ఉన్న వాళ్లకు స్వంతవారిని వెతకడమే పనిగా పెట్టుకుంటాడు. దీని వల్ల అందరికీ సుపరిచితుడవుతాడు. శైలజ (మాల్వీ మల్హోత్రా) ఇతనికి పరిచయమై ప్రేమలో పడి జీవిత భాగస్వామి అవుతుంది. ఇంకోవైపు కరుడుగట్టిన ఫ్యాక్షన్ రౌడీ కొండా రెడ్డి (మకరంద్ దేశ్ పాండే) శైలజ కోసం వెతుకుతూ ఆ బాధ్యతను గిరికే ఇస్తాడు. అయితే తాను అనుకున్నట్టు ఆమె మాములు అమ్మాయి కాదని, చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలుస్తుంది. ఇక్కడి నుంచి అసలు డ్రామా మొదలవుతుంది. ఆ తర్వాత జరిగేది గెస్ చేయొచ్చు

విశ్లేషణ

స్టార్ ఇమేజ్ ఉన్న పెద్ద హీరోలు ఎన్నిసార్లు మాస్ అవతారాలు ఎత్తినా ప్రేక్షకులు ఒప్పుకుంటారు. విజిల్స్ వేయించేలా కమర్షియల్ ఎలిమెంట్స్, పైసా వసూల్ అనిపించేలా అంశాలు దట్టిస్తే చాలు. కానీ ఇంకా పెద్ద స్థాయికి చేరుకోని హీరోలకు ఇది వర్తించదు. దర్శకుడు రవికుమార్ చౌదరి ఏ కోణంలో రాజ్ తరుణ్ ని ఇలాంటి సబ్జెక్టుకి ఫిట్ అవుతాడని ఊహించాడో అంతు చిక్కదు కానీ అసలు ఎప్పుడో పాతికేళ్ల క్రితం రావాల్సిన అవుట్ డేటెడ్ కంటెంట్ ని 2024లో తీసుకురావడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. సగం టైం పాస్ చేయించి మిగిలిన సగం మసాలాలతో నింపేసే 90 నాటి కాలం కాదు ఇది. ఎంతో కొంత వైవిధ్యం లేనిదే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు.

ఒక అనాథ, సమస్య ఉన్నవాళ్లకు సహాయం చేయడం, హీరోయిన్ నేపధ్యానికి విలన్ కి లింక్ ఉండటం ఇదంతా ఎప్పుడో అరిగిపోయిన పాత కాలం చింతకాయ పచ్చడి. దీన్ని మళ్ళీ కొత్తగా వేడి చేసి వడ్డించాలనుకోవడమే రవికుమార్ చౌదరి ఆలోచనా రాహిత్యానికి నిదర్శనం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫక్తు రొటీన్ తరహాలో గతంలో చూసిన ఎన్నో సినిమాల ఛాయల్లో సాగుతుంది. రచ్చతో మొదలుపెట్టి వీరసింహారెడ్డి దాకా లెక్కలేనన్నీ ఎంత వద్దనుకున్నా గుర్తుకు వస్తూనే ఉంటాయి. పోనీ అవేమైనా నవ్వించేలా లేదా టైం పాస్ చేయించేలా ఉన్నాయా అని ప్రశ్నించుకుంటే సగటు ఆడియన్స్ ఇంతకన్నా నేనే బాగా రాయగలను కదా అనిపించేలా సాగుతాయి.

హీరో క్యారెక్టరైజేషన్ ని ఏదో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా రాసుకున్నానని భ్రమపడిన రవికుమార్ చౌదరి విలన్ కి పెట్టిన సెటప్, అతను చేసే పనులను చిరాకు పుట్టించేలా చూపించాడు. ఉదాహరణకు శైలజని వెతికే ప్రహసనంలో జాడ తెలియదని చెప్పిన వాళ్ళను మర్డర్ చేసే లాజిక్ ఎంత బుర్రపాడు చేసుకున్నా అర్థం కాదు. హీరోయిన్ తాలూకు రహస్యాన్ని ఏదో మల్లేశ్వరి రేంజ్ లో రివీల్ చేసి ఇక అక్కడి నుంచి ఒక్కడు స్టయిల్ లో అవసరానికి మించి ఎలివేషన్లతో ఏదేదో చేయబోయి పరమ ఖంగాళీ చేశారు. మన్నార్ చోప్రా ట్రాక్ సహనాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి విసిగిస్తుంది. అసలు టైం మెషీన్ లో మనం ఏ కాలానికి వచ్చామా అనిపించేలా చేస్తుంది.

కామెడీని సైతం దారుణంగా హ్యాండిల్ చేశారు రవికుమార్ చౌదరి. బిత్తిరి సత్తి, 30 ఇయర్స్ పృథ్వి లాంటి వాళ్ళను తీసుకున్నారన్న మాటే కానీ కనీసం జబర్దస్త్ స్థాయిలో జోకులైనా రాసుకుని ఉంటే మాస్ కొంత ఎంజాయ్ చేసేవాళ్ళేమో. ఇక శైలజ ఎవరో రివీలయ్యే క్రమాన్ని కొంత వరకు డీసెంట్ గా కట్ చేసినా ఆ తర్వాత స్క్రీన్ ప్లే ఎలా నడపాలో అర్థం కాక కొండారెడ్డి వెర్రిమొర్రి పనుల్లాగే ఎటెటో తీసుకెళ్లిపోయాడు. లెన్త్ రెండు గంటల లోపే ఉన్నా చిరాకు పుట్టిందంటే ఎన్నేసి తప్పులు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. పేపర్ మీద చదువుతుంటేనే తప్పుల తడకగా అనిపించే ఇలాంటి ట్రీట్ మెంట్ ని యథాతథంగా తెరెకెక్కించిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి.

సీనియరైనా జూనియరైనా దర్శకులు తమ మెదళ్లను అప్డేట్ చేసుకోకపోతే తమ కెరీర్ లతో పాటు హీరోల మార్కెట్ కూడా ఉప్పు పాతరైపోతుంది. ప్రేక్షకులకు లెక్కలేనన్ని ఆప్షన్లు వినోదాన్ని అందించేందుకు పోటీ పడుతుండగా వాళ్ళను థియేటర్ కు రప్పించాలంటే ఆషామాషీ పని కాదని అత్యవసరంగా గుర్తించాలి. లేదంటే తిరగబడరా సామీలు వస్తూనే ఉంటాయి. తిరస్కారానికి గురవుతూనే ఉంటాయి. రోత పుట్టే కథా కథనాలకు కాలం చెల్లింది. లేదు మేం మారం, ఇలాంటివి తీస్తూనే ఉంటాం అంటే భవిష్యత్తులో ఆడియన్స్ కి కనీసం జాలీపడే టైం కూడా ఉండదు. ఖాళీ థియేటర్లను చూసుకుని నిర్మాతలు శోకాలు పెట్టడం తప్ప జరిగేది శూన్యం.

నటీనటులు

రాజ్ తరుణ్ యాక్టర్ గా ఫెయిలైన సందర్భాలు లేవు. ఇది తన కెపాసిటీకి మించిన క్యారెక్టర్. అయినా సరే వీలైనంత వరకు మోశాడు కానీ బిల్డప్పులు ఎక్కువైన చోట మాత్రం చేతులు ఎత్తేశాడు. మాల్వీ మల్హోత్రా అందం ఓ మోస్తరుగా ఓకే అనుకున్నా నటన మాత్రం అంతంత మాత్రమే. ఫైట్లు కూడా పెట్టారు కానీ అతకలేదు. మన్నార్ చోప్రా అతిగా అనిపించగా మోతాదు మించిన చేసిన గ్లామర్ షో తేడా కొట్టేసింది. మకరంద్ దేశ్ పాండేని ప్రకాష్ రాజ్ రేంజ్ లో ఎలా చూపించాలనుకున్నారో కానీ ఆ ఆలోచనకు దండం పెట్టాలి. టాలెంటెడ్ నటుడు వృధా అయ్యాడు. రాజా రవీంద్ర, జాన్ విజయ్, ప్రగతి, రఘుబాబు , గీతా సింగ్ తదితరులు ఎందరున్నా లాభం లేకపోయింది.

సాంకేతిక వర్గం

జెబి – భోలేశావలి సంగీతంలో ఎలాంటి మెరుపులు లేవు. ఐటెం సాంగ్ కూడా తేడా కొట్టేసింది. మిగిలిన పాటలు ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. జవహర్ రెడ్డి ఛాయాగ్రహణం మీద ఫిర్యాదు లేదు. ఉన్నంతలో డ్యూటీని కరెక్ట్ గా చేశారు. తనమీద నిండా రాకుండా చూసుకున్నారు. ఎడిటింగ్ నిడివిని వీలైనంత కంట్రోల్ చేసి తగ్గించినా సరే అసలు మ్యాటర్ మరీ వీక్ గా ఉండటంతో విపరీతమైన సాగతీత అనిపిస్తే అది ఆయన తప్పు కాదు. డైలాగులు కూడా సోసోనే. ఏ మాత్రం ప్రత్యేకంగా అనిపించవు. ఇంత బ్యాడ్ అవుట్ ఫుట్ లోనూ మెచ్చుకోవాల్సింది నిర్మాతను. గుడ్డిగా నమ్మి కోట్ల ఖర్చుకి సిద్దపడటం అంటే నమ్మకం కాదు ఎనలేని సాహసం.

ప్లస్ పాయింట్స్

ఒకటి రెండు సీన్లు

మైనస్ పాయింట్స్

విసిగించే కథా కథనాలు
బిల్డప్ హీరోయిజం
విలన్ ట్రాక్
కుదరని కమర్షియల్ అంశాలు

ఫినిషింగ్ టచ్ : తట్టుకోలేం సామీ

రేటింగ్ : 1.5 / 5