సమీక్ష – టిల్లు స్క్వేర్

DJ Tillu Square Telugu Review

3/5

2 Hr 5 Mins   |   Coedy   |   29-03-2024


Cast - Siddhu Jonnalagadda, Anupama Parameswaran, Neha Shetty, Murli Sharma, Muralidhar Goud, Prince Cecil and others

Director - Mallik Ram

Producer - Naga Vamsi, Sai Soujanya

Banner - Sithara Entertainments

Music - Ram Miryala, Achu Rajamani, Thaman

కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడిచినా సరైన బ్రేక్ కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూసిన సిద్దు జొన్నలగడ్డకు డీజే టిల్లు తిరుగులేని బ్రేక్ ఇవ్వడమే కాదు యూత్ లో ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. అందుకే అవకాశాలు ఎన్ని తలుపు తడుతున్నా సీక్వెల్ కోసమే రెండేళ్లకు పైగా ఎదురు చూశాడు. మల్లిక్ రామ్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన టిల్లు స్క్వేర్ మీద తనకే కాదు ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వేసవి ప్రారంభంలో దానిక్కావాల్సిన సమ్మర్ కిక్ ని స్టార్ బాయ్ ఇచ్చాడా

కథ

రాధిక తన జీవితంలో నుంచి వెళ్ళిపోయాక ఈవెంట్ మేనేజ్ మెంట్ నిర్వహిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు టిల్లు (సిద్దు జొన్నలగడ్డ). ఓ పార్టీలో లిల్లీ(అనుపమ పరమేశ్వరన్)ని చూసి మనసు పారేసుకుని తొలి చూపులోనే ప్రేమించి బాగా దగ్గరవుతాడు. గతంలో మాదిరే సిద్దుకి ఈసారి కూడా పుట్టినరోజు సందర్భంగా ఊహించని సంఘటనలు ఎదురై పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. దానికి ఒక మాఫియా డాన్ (మురళి శర్మ)కి కనెక్షన్ ఉంటుంది. ఇంతకీ టిల్లు ఫేస్ చేసిన సమస్యేంటి, దాన్నుంచి ఎలా బయట పడ్డాడనేది స్టోరీ.

విశ్లేషణ

టిల్లు ఒక బ్రాండ్ గా మారడానికి, దాని కొనసాగింపుకి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఆ క్యారెక్టరైజేషన్ లో ఉన్న మెరుపులు, చమక్కులే. తింగరిగా అనిపించే విచిత్రమైన స్లాంగ్ తో, అమాయకత్వాన్ని తెలివి అనుకుని దూకుడుగా ప్రవర్తించే పాత్రలో సిద్దు జీవించిన వైనం డీజే టిల్లుని అంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసింది. ఇది దృష్టిలో పెట్టుకునే దర్శకుడు మల్లిక్ రామ్ ఎక్కడా ఆ ఫ్లేవర్ ని మిస్ చేసుకుండా రాసుకున్న ట్రీట్ మెంట్ సరిపడా కుదరడం టిల్లు స్క్వేర్ కున్న అతి పెద్ద బలం. సబ్జెక్టు పరంగా మరీ కొత్తదనం కనిపించదు. ఆ మాటకొస్తే కేవలం పేపర్ మీద చదివితే లేదా ఎవరైనా చెప్పినప్పుడు వింటే గతంలో ఇలాంటివి చూశాం కదానే ఫీలింగ్ కలుగుతుంది.

కానీ తెరమీద జరిగింది వేరు. మల్లిక్ రామ్, సిద్దులతో పాటు మరో ఇద్దరు రచయితల బృందం వన్ లైనర్ల నుంచి కామెడీని పిండుకోవాలని చూసిన వైనం ఈ సినిమాని ప్రత్యేకంగా నిలిపింది. మొదటి నలభై నిముషాలు పెద్దగా వేగం ఉండదు. సిద్దు పరిచయం, వేడుకలకు వెళ్లి డీజే కొట్టడం, టైటిల్ సాంగ్ ని రిపీట్ చేయడం ఇలా మరీ స్పెషల్ అనిపించేలా ఏం లేకుండా సాగుతుంది. అయితే టిల్లు వాడే పంచులు ఎక్కడిక్కడ కంచులా నిలబడ్డాయి. లిల్లీ లవ్ ట్రాక్ లో కాస్త ఎక్కువ రొమాన్స్ దట్టించారు కానీ నిజానికి అంత అవసరం లేకుండా కూడా స్క్రీన్ ప్లే రన్ చేయొచ్చు. యూత్, మాస్ కోసం స్పైసీగా ఉండాలని పెట్టడం ఫ్యామిలిస్ కి కొంత ఇబ్బందే.  

ఇంటర్వెల్ దగ్గర ఊహించని ట్విస్ట్ ఇచ్చిన మల్లిక్ రామ్ సెకండ్ హాఫ్ కోసం కావాల్సిన ఆసక్తి సరైన రీతిలో ఎస్టాబ్లిష్ చేశాడు. టిల్లుకిచ్చిన మిషన్, లిల్లీకు పెట్టిన ముఖ్యమైన మలుపు లాజిక్స్ కి దూరంగా అనిపించినా సరే ఎంటర్ టైన్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో కొన్ని చిన్న చిన్న లోపాలు క్షమించేలా సాగాయి. డీజే టిల్లులోని ముఖ్యమైన పాత్రలకు ఇక్కడ ఖచ్చితంగా ముడిపెట్టాలనే ఆలోచన మంచిదే కానీ ఒకదశ దాటాక అవి రిపీట్ అనిపించిన ఫీలింగ్ కలిగించడం మైనస్ గా తోస్తుంది. మురళీధర్ గౌడ్ పైల్స్ సమస్య పేలింది. ఎక్కడిక్కడ రెగ్యులర్ బ్లాక్స్ లో నవ్వుకోవడానికి సరిపడా స్టఫ్ ఇవ్వడంలో టీమ్ సక్సెసవుతూ వచ్చింది.

మురళీశర్మ వచ్చాక వేగం పెరగడం రెండో సగాన్ని గట్టిగా నిలబెట్టింది. నేహా శెట్టి రీ ఎంట్రీతో మొదలుపెట్టి చివరి అరగంట హిలేరియస్ గా నడిపించాడు. ముఖ్యంగా రాధికా అంటూ సిద్దు ఆమె గొప్పదనాన్ని వ్యంగ్యంగా వివరించే తీరుకు నవ్వకుండా ఉండటం కష్టం. ఆ తర్వాత టిల్లు చావు దాకా వెళ్లి బయటికొచ్చి అసలు నేరస్థులను పట్టించే ఎపిసోడ్ ని సీరియస్ గా నడిపించకుండా వినోదానికి పెద్ద పీఠ వేయడం ఎండ్ కార్ట్ పడే సమయానికి సంతృప్తి కలిగేలా చేసింది. డీజే టిల్లు మేజిక్ ని రెట్టింపు చేసేలా, టైటిల్ కు తగ్గట్టు ఈ స్క్వేర్ డబుల్ ఫన్ పండించాడా అంటే డెబ్భై శాతం సమాధానం ఔననే అవుతుంది. మిగిలిన ముప్పై శాతం పల్చని కథ వల్ల తగ్గింది అంతే.

కాలక్షేపం చాలని కోరుకుని, సిద్దు నుంచి ఏదైతే ఆశిస్తామో దాన్ని సంపూర్ణంగా ఇవ్వడంలో టిల్లు స్క్వేర్ బృందం సక్సెసయ్యింది. కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ దాన్ని దాచడంలో మల్లిక్ రామ్ టీమ్ ఫెయిల్ కాలేదు. ఎలివేషన్లు, విజువల్ గ్రాండియర్లు, భారీ బడ్జెట్లు రాజ్యమేలుతున్న ట్రెండ్ లో టిల్లు స్క్వేర్ ఒక సన్నని హాయినిచ్చే జల్లులా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎంత స్థాయికి వెళ్తుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ టిల్లు బ్రాండ్ ని కొనసాగించే ధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. సిచువేషన్స్  వాడుకున్న తీరు, కేవలం సందర్భాల నుంచే హాస్యాన్ని పుట్టించిన విధానం ఈ రెండో టిల్లుని కూడా స్పెషల్ గా నిలబెట్టింది

నటీనటులు

సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన టైమింగ్ తో చెడుగుడు ఆడేశాడు. ఏ అంచనాలతో తనను చూస్తారో వాటిని సంపూర్నంగా నెరవేర్చాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు దాకా విశ్వరూపం చూడొచ్చు. అనుపమ పరమేశ్వరన్ నూరు శాతం పర్ఫెక్ట్ ఛాయస్. గ్లామర్ డోస్ తో పాటు తన పాత్రకిచ్చిన ట్విస్టులను, బోల్డ్ నెస్ ని చక్కగా ప్రదర్శించింది. నేహా శెట్టికి కనిపించిన కాసేపు గుర్తుండిపోయే బ్లాక్ పడింది. మురళీశర్మ ఎక్కువ సేపు లేకపోయినా ఉనికిని చాటుకున్నాడు. ప్రిన్స్ కొంచెం లౌడ్ గా అనిపించినా ఓకే. బ్రహ్మాజీ ఒక్క సీన్ కే పరిమితం చేశాడు. మురళీధర్ గౌడ్ మరోసారి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇతర ఆర్టిస్టులకు దక్కిన స్కోప్ తక్కువే అయినా లాక్కొచ్చేశారు

సాంకేతిక వర్గం

రామ్ మిర్యాల, అచ్చు రాజమణి పాటలు బాగున్నాయి. డీజే టైటిల్ ట్రాక్ మళ్ళీ వాడుకున్నారు కానీ కొత్తగా ట్రై చేయాల్సింది. విజువల్ గా కూడా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. అక్కడక్కడా కొంచెం అటుఇటు ఊగినా మూడ్ ని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చాడు. సాయి ప్రకాష్ ఛాయాగ్రహణంలో లోపాలేం లేవు. ఫ్రేమింగ్, కలర్ టోన్ అన్నీ మంచి క్వాలిటీలో వచ్చాయి. నవీన్ నూలి ఎడిటింగ్ నిడివిని కేవలం రెండు గంటలకు కుదించడం పెద్ద ప్లస్ పాయింట్. దీని వల్ల ల్యాగ్ కు ఛాన్స్ దొరకలేదు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బడ్జెట్ పరంగా ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టారు. రాజీ ప్రస్తావన రాలేదు.

ప్లస్ పాయింట్స్

సిద్దు టైమింగ్, ఎనర్జీ
అనుపమ పాత్ర
ట్రెండీ కామెడీ
నిడివి

మైనస్ పాయింట్స్

ప్రత్యేకంగా అనిపించని కథ
కొన్ని రిపీట్ సీన్లు

ఫినిషింగ్ టచ్ : ఫన్ స్క్వేర్  

రేటింగ్ : 3 / 5