2.5/5
2 Hr 40 Mins | Action | 25-01-2024
Cast - Hrithik Roshan, Deepika Padukone, Anil Kapoor, Rishabh, Karan Singh, Akshay Oberoi and others
Director - Siddharth Anand
Producer - Siddharth Anand, Jyoti Deshpande, Ramon Chibb, Ajit Andhare, Anku Pande, Kevin Vaz, Mamta Bhatia
Banner - Viacom18 Studios, Marflix Pictures
Music - Vishal and Sheykhar
తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా హృతిక్ రోషన్ కు ఇక్కడ కూడా క్రేజ్ ఉంది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించబోతున్నాడనే వార్త కన్ఫర్మ్ అయ్యాక తారక్ అభిమానులకు అతని మీద ఆసక్తి పెరిగింది. దీంతో పాటు సహజంగానే ఉన్న హైప్ వల్ల ఫైటర్ మీద అంచనాలు మొదలయ్యాయి. షారుఖ్ ఖాన్ డంకీ లా ఏ భాషలోనూ డబ్బింగ్ చేయకూడదని నిర్ణయించుకున్న ప్రొడ్యూసర్స్ కేవలం హిందీ వెర్షన్ ని మాత్రమే రిలీజ్ చేశారు. మరి జెట్ ఫ్లైట్స్ వేసుకొచ్చిన ఫైటర్ యుద్ధ రంగంలో గెలిచాడా లేదా
కథ
శ్రీనగర్ ఎయిర్ ఫోర్స్ ని లక్ష్యంగా పెట్టుకుని పాకిస్థాన్ తీవ్రవాది అజర్ అక్తర్(రిషబ్ షానే) కుట్రలు పన్ని పౌరుల రక్షణ కోసం వచ్చిన సిఆర్పిఎఫ్ బలగాలను భారీ ఎత్తున మట్టుబెడతాడు. దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే స్కాడ్రన్ లీడర్ షంషేర్ అలియాస్ ప్యాటీ (హృతిక్ రోషన్) ది దూకుడు మనస్తత్వం. మిన్నీ(దీపికా పదుకునే)ని ఇష్టపడతాడు. తన చర్యల కారణంగా శత్రువు వ్యూహంలో చిక్కి ఇద్దరు సహచరులను పోగొట్టుకుని హైదరాబాద్ కు బదిలీ అవుతాడు. అయితే అక్కడా కుదురుకోలేక ఆర్మీని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో పాక్ సైన్యానికి దొరికిన ఇద్దరు కొలీగ్స్ కోసం తిరిగి వస్తాడు. తర్వాత జరిగేది తెలిసిందే.
విశ్లేషణ
మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి కానీ ఎయిర్ ఫోర్స్ నేపధ్యంగా తీసుకున్నవి తక్కువ. ఎందుకంటే మొహాలు కనిపించే అవకాశం తక్కువగా ఉన్న ఇలాంటి వార్ డ్రామాలతో మాస్ ఆడియన్స్ ని మెప్పించడం కష్టం. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ అయినా సరే రిస్క్ తీసుకున్నాడు. నిజానికి స్టోరీ పరంగా ఇందులో ఎలాంటి కొత్తదనం లేదు. పైగా అరిగిపోయిన యాంటీ పాకిస్థాన్ ఫార్ములానే మళ్ళీ వాడుకున్నాడు. ఈ సంగతి ట్రైలర్ లోనే స్పష్టం చేసినప్పటికీ ట్రీట్ మెంట్ లో కొత్తదనం ఉంటుందేమోనని ప్రేక్షకులు ఆశిస్తారు. అయితే సిద్దార్థ్ ఈసారి యాక్షన్ తో సమానంగా ఎమోషన్స్ మీద దృష్టి పెట్టాడు.
చాలా రెగ్యులర్ సెటప్ తో ఫైటర్ మొదలయ్యాక అసలైన కంటెంట్ ఆకాశంలోకి హీరో అతని బృందం జెట్ విమానాలు వేసుకుని తిరిగినప్పుడు మొదలవుతుంది. వాటికి స్ఫూర్తి హాలీవుడ్ మూవీ టాప్ గన్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ ఎంగేజ్ చేయడంలో సిద్దార్థ్ ఆనంద్ ఫెయిల్ కాలేదు. పైగా 3డి ఎఫెక్ట్స్ జోడించడంతో కొత్త అనుభూతినిస్తాయి. ప్యాటీ టీమ్ పార్టీ చేసుకోవడం, మిన్నీతో సన్నివేశాలు మాములుగా జరుగుతాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి వేగం పెంచిన సిద్దార్థ్ ఆనంద్ మరీ గూస్ బంప్స్ అనిపించే స్థాయిలో కాదు కానీ ప్యాటీ అతని ఫ్రెండ్స్ పాక్ లోకి చొరబడి వాళ్ళ క్యాంపులను ధ్వంసం చేసే ఎపిసోడ్స్ ని బాగానే తీశారు.
విశ్రాంతి తర్వాత అసలు సమస్య వస్తుంది. దేశభక్తిని రిజిస్టర్ చేసే ఉద్దేశంతో భావోద్వేగాలకు విపరీతమైన చోటు కల్పించిన సిద్దార్థ ఆనంద్ కొన్ని సీన్లను హత్తుకునేలా తీశారు. ఎయిర్ పోర్ట్ లో మిన్నీ తలితండ్రులకు ఆడపిల్లల పెంపకం, వాళ్ళ గొప్పదనం వివరించే ఘట్టం బాగా వచ్చింది. అయితే ఇదంతా అసలు కథకు అంతగా అవసరం లేని వ్యవహారం కావడంతో ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది. ఎయిర్ ఫోర్స్ లో పని చేసే వాళ్ళు ఎంతటి సాహసవంతులో, అంతకన్నా త్యాగాలు చేస్తున్నారనే సందేశం ఇవ్వాలనే తాపత్రయంతో సిద్దార్థ్ ఆనంద్ నిడివి బాగా ఎక్కువవుతోందనే పాయింట్ ని గుర్తించలేకపోయాడు. దీంతో కథనం ఎంతకీ ముందుకు కదలదు.
సిన్సియర్ గా వైమానిక సైన్యం గొప్పదనాన్ని చెప్పాలనుకున్నప్పుడు నిజాయితీ ఎంత అవసరమో తగినంత సినిమాటిక్ కోటింగ్ తో పాటు లాజిక్స్ కూడా అవసరం. హృతిక్, అనిల్ కపూర్ టీమ్ సెటప్ ని బాగా రాసుకున్న సిద్దార్థ్ ఆనంద్ అసలైన విలన్ క్యారెక్టరైజేషన్ ని బలహీనంగా రాసుకోవడం ఓవరాల్ ఫీల్ ని తగ్గించేసింది. పైగా ఆర్టిస్టు సెలక్షన్ చాలా బ్యాడ్ ఛాయస్. అతను ఎంత మాత్రం నప్పలేదు. పాకిస్థాన్ ప్రభుత్వం, మిలిటరీ మొత్తం అతని చెప్పు చేతల్లో ఉందన్న రీతిలో చూపించడం అతిశయోక్తికి దూరంగా వెళ్ళింది. అక్కడ అరాచకాలు నిజమే అయినా మరీ సిల్లీగా చూపించిన విధానం ఇంప్రెషన్ తగ్గించింది. బాగా డెప్త్ గా ఉండాల్సిన ట్రాక్ ఇది.
మొత్తంగా చూసుకుంటే ఫైటర్ నిరాశపరచడు కానీ ఎక్కువ ఊహించుకుంటే మాత్రం పూర్తి సంతృప్తిని ఇవ్వలేడు. పరిమిత బడ్జెట్ లోనే మంచి యాక్షన్ విజువల్స్, మన సైన్యం పోరాట పటిమను చూపించే ఎయిర్ ఫైట్లు, కొంచెం బరువు అనిపించినా టచ్ చేసే ఎమోషన్లు వీటి కోసం రొటీన్ ప్లాట్ ని భరిస్తామంటే ఫైటర్ ని ఛాయస్ గా పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఎక్కడిక్కడ గూస్ బంప్స్ విపరీతంగా ఉండాలంటే మాత్రం ఇందులో అంత స్పెషల్ అనిపించదు. ఫైనల్ గా రెగ్యులర్ కమర్షియల్ మసాలాకు దూరంగా చేసిన ప్రయత్నంగా ఫైటర్ ఒకసారి చూడొచ్చనే క్యాటగిరీలో ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే కమర్షియల్ స్కేల్ ఊహించినంత భారీగా రాకపోవచ్చు
నటీనటులు
హృతిక్ రోషన్ ఎప్పటిలాగే అంచనాలకు తగ్గట్టు హీమ్యాన్ అనిపించుకున్నాడు. ఎక్కువగా గ్రీన్ మ్యాట్ మీద ఆధారపడిన కంటెంట్ కావడం వల్ల రిస్క్ అనిపించే ఛాలెంజులు దక్కలేదు కానీ ఉన్నంతలో ప్యాటీగా బెస్ట్ ఇచ్చాడు. దీపికా పదుకునే హుందాగా నటించడమే కాదు హోమ్లీగా ఉంది. అందాలు ఆరబోసిన పాట తీసేయడం మంచిదయ్యింది. మెయిన్ విలన్ రిషబ్ సానే అసలు నప్పలేదు. ఇంటెన్స్ ఉన్న ఆర్టిస్టుని పెట్టాల్సింది. అనిల్ కపూర్ ఎప్పటిలాగే అనుభవంతో చెలరేగిపోయారు. అశుతోష్ రానా కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోయే పాత్ర దక్కింది. ఎయిర్ ఫోర్స్ బృందంలో తారాగణం బాగా కుదిరారు. అందరి పెర్ఫార్మన్స్ ఓకే అనిపిస్తుంది
సాంకేతిక వర్గం
విశాల్ శేఖర్ పాటలు ప్రత్యేకంగా చెప్పుకోదగిన స్థాయిలో లేవు. సందర్భానికి తగ్గట్టు అలా వచ్చి వెళ్తాయి. బోర్డర్ తరహాలో క్యాచీ ట్యూన్స్ పడి ఉంటే స్థాయి పెరిగేది. సంచిత్ – అంకిత్ బలరాల నేపధ్య నేపధ్య సంగీతం దర్శకుడి ఆలోచనలను బలంగా ఎలివేట్ చేసింది. కొన్ని మాములు సీన్లను సైతం నిలబెట్టారు. సచిత్ పలౌస్ కెమెరా వర్క్ గురించి ఎన్ని ప్రశంసలు ఇచ్చినా తక్కువే. ఎన్నో పరిమితుల మధ్య గొప్ప క్వాలిటీని ఇచ్చారు. ఆరిఫ్ షేక్ ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉంటే సెకండ్ హాఫ్ ల్యాగ్ తగ్గేది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. వయాకామ్ 18, మార్ ఫ్లిక్స్ నిర్మాణ విలువలు అడిగినంత ఖర్చు చేసి ఫిర్యాదు చేసే ఛాన్స్ ఇవ్వలేదు.
పాజిటివ్ పాయింట్స్
దేశభక్తి అంశం
ఎయిర్ ఫోర్స్ నేపథ్యం
యాక్షన్ ఎపిసోడ్స్
భావోద్వేగాలు
మైనస్ పాయింట్స్
విలన్ పాత్ర
రొటీన్ పాకిస్థాన్ సెటప్
హై ట్విస్టులు లేకపోవడం
సెకండ్ హాఫ్ ల్యాగ్
ఫినిషింగ్ టచ్ – యావరేజ్ సైనికుడు
రేటింగ్ : 2.5 / 5
Gulte Telugu Telugu Political and Movie News Updates