సమీక్ష – డెవిల్

2.5/5

2 Hr 26 Mins   |   Action   |   29-12-23


Cast - Kalyan Ram, Samyukta Menon, Malvika Nair, Edward Sonnenblick, Srikanth Iyengar, Seetha, Satya, & others

Director - Abhishek Nama

Producer - Abhishek Nama

Banner - Abhishek Pictures Banner

Music - Harshavardhan Rameshwar

కుటుంబ నేపథ్యం ఎంత బలంగా ఉన్నా కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా ఈ మధ్య ప్రయోగాలకు ఎక్కువ అవకాశమిస్తున్న కళ్యాణ్ రామ్ డెవిల్ మీద అభిమానులకు మంచి అంచనాలున్నాయి. దర్శకుడి మార్పు గురించి ఇండస్ట్రీ, సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన నేపథ్యంలో అసలు సినిమా ఎలా ఉందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. సలార్ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో థియేటర్లలో అడుగు పెట్టిన చిత్రంగా బయ్యర్లు కూడా దీని మీద బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. మరి డెవిల్ అంచనాలు అందుకున్నాడా

కథ

స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్ల తరఫున గూఢచారిగా పని చేస్తుంటాడు డెవిల్(కళ్యాణ్ రామ్). జమీందార్ కూతురు హత్యచేయబడితే ఆ కేసుని విచారించడానికి ప్రభుత్వం అతన్ని అక్కడికి పంపిస్తుంది. అజ్ఞాతంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాడకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం నైషద(సంయుక్త మీనన్)దగ్గర ఉందని తెలుసుకుని ఒకవైపు ప్రేమిస్తూనే మరోవైపు గుట్టుని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో ఎన్నో విభ్రాంతి కలిగించే రహస్యాలు బయటపడతాయి. అవేంటనేది తెరమీద చూడాలి

విశ్లేషణ

పీరియాడిక్ డ్రామాకు క్రైమ్ థ్రిల్లర్ ని ముడిపెట్టి దాని ద్వారా నేతాజీ గొప్పదనాన్ని చెప్పాలనుకోవడం నిజంగా గొప్ప ఆలోచన. గత కొన్నేళ్లలో 1945 నేపథ్యంలో చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి. ఆర్ఆర్ఆర్ లాంటి అతి కొన్ని మాత్రమే ఆడియన్స్ ని మెప్పించగలిగాయి. అలాంటి అవకాశం తామూ వాడుకోవాలనే ఆలోచనతో రచయిత శ్రీకాంత్ విస్సా, దర్శకుడు అభిషేక్ నామా చేతులు కలిపారు. టేకాఫ్ లోనే ఎలాంటి సుదీర్ఘ పరిచయాలు, అనవసరపు సన్నివేశాలు లేకుండా నేరుగా మర్డర్ తో మొదలుపెట్టి తామేం చెప్పబోతున్నారో ప్రిపేర్ చేస్తారు. డెవిల్ ఎంట్రీ అయ్యాక కథనం ఊహించని పరుగులు పెట్టాలని సాగటు ప్రేక్షకులు కోరుకుంటారు.

ఇక్కడిదాకా బాగానే వెళ్తుంది. మిస్టరీని ఛేదించడానికి డెవిల్ ఊళ్ళో అడుగు పెట్టాక జరిగే సంఘటనలు చాలా మటుకు ఊహించేలా సాగటం ఫ్లోని అంతగా ముందుకు వెళ్లనివ్వలేదు. సుభాష్ చంద్రబోస్ కి తెల్లదొరలు ఎంతగా వణికిపోయేవారో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం సరిగా జరగకపోవడంతో ఆయన తాలూకు ఎమోషన్, దేశభక్తి ఆడియన్స్ ఫీలవ్వకుండా చేసింది. దాని స్థానంలో డెవిల్, నైషదల మధ్య అవసరం లేని ప్రేమకథని ఇరికించే ప్రయత్నం ఫ్యాన్స్, మాస్ ని ఆకట్టుకునే తాపత్రయం తప్ప అంతగా సింక్ అవ్వలేదు. అందుకే ప్రీ క్లైమాక్స్ లో ఒక షాకింగ్ ఘటన జరిగినప్పుడు వాళ్ళిద్దరి భావోద్వేగం సరిగా రిజిస్టర్ కాదు. డ్రామా ఫ్లాట్ గా వెళ్తే వచ్చే సమస్య ఇది.

ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర గేరు మార్చిన దర్శకుడు అభిషేక్ ఆపై ట్విస్టులను బాగానే పేర్చుకుంటూ పోయారు కానీ ఎక్కడా హై అనిపించే అవకాశం ఇవ్వకపోవడంతో వావ్ అనిపించేలా మేజిక్ చేయలేకపోయారు. జైల్లో షఫీని బందించాక డెవిల్ చేసే విధ్వంసం బాగానే పేలింది కానీ సెకండ్ హాఫ్ మొత్తాన్ని నిలబెట్టడానికి సరిపోలేదు. కళ్యాణ్ రామ్ అండర్ కవర్ ఏజెంటని ముందే ప్రేక్షకుడు పసిగట్టేస్తాడు కాబట్టి వీలైనన్ని ఎలివేషన్లు పడే ఎపిసోడ్లు ఉంటే డెవిల్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది. కానీ అభిషేక్ నామా ఆ దిశగా వెళ్ళలేదు. ట్రిపులార్లో క్రమం తప్పకుండ వీటిని మైంటైన్ చేయడం వల్లే అది గ్లోబల్ ఆడియన్స్ ని మెప్పించింది. డెవిల్ కూ ఆ ఛాన్స్ ఉంది కానీ వాడలేదు.

త్రివర్ణ మలుపు మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం ఇంకో ప్రస్తావించాల్సిన మైనస్. దీనివల్ల మిగిలిన పాత్రలకు పని తగ్గిపోయి డెవిల్, నైషదల మీద ఆధారపడాల్సి వచ్చింది. భారతీయుడులో కమల్ హాసన్ గతాన్ని శంకర్ ఆవిష్కరించే తీరు తాకేలా ఉంటుంది. డెవిల్ లో అలాంటివి పెట్టాలని కాదు కానీ స్వాతంత్ర పోరాటంలో నేతాజీ కోసం అయన బృందం పడిన కష్టాలు, చేసిన సాహసాల మీద కొన్ని జోడించి ఉంటే కథనం పట్టుతో సాగేది. ఎంతసేపూ ఆయన ఇండియాకు ఎప్పుడు వస్తాడనే సింగల్ పాయింట్ మీద నడిపించడంతో సబ్ ప్లాట్స్ కు స్కోప్ లేక నెరేషన్ పట్టు తప్పింది. వీలైనంత వరకు టెక్నికల్ వాల్యూస్ బలహీనతలను కాపాడేందుకు చూశాయి.

నిస్సందేహంగా డెవిల్ మ్యాటరున్న సబ్జెక్టే. అయితే రైటింగ్, టేకింగ్ రెండింటిలోనూ అనుభవ రాహిత్యం ఉండటం వల్ల ఫుల్ మీల్స్ గా మెప్పించాల్సిన గ్రాండియర్ కాస్తా సగం ఆకలి తీర్చిన ప్లేటు భోజనంగా మారిపోయింది. క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్, సాంకేతికవర్గం పనితనం, భారీతనం ఇవన్నీ మరీ బ్యాడ్ ప్రోడక్ట్ కాకుండా నిలబెట్టాయి. కానీ బింబిసార తరహాలో బ్లాక్ బస్టర్ కు ఉండాల్సిన లక్షణాలు పుణికిపుచ్చుకోలేకపోయింది. ఓ మోస్తరుగా ఉన్నా చాలు అనుకుంటే డెవిల్ మరీ నిరాశపరచడు. ఓకే అనిపిస్తాడు. ఫ్యాన్స్ సంతృప్తి చెందొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుల కోణంలో మాత్రం అంచనాలు నిలబెట్టుకోవడంలో యాభై మార్కుల దగ్గరే ఆగిపోయాడు.

నటీనటులు

కళ్యాణ్ రామ్ రెండు షేడ్స్ ని ఎలాంటి తడబాటు లేకుండా అలవోకగా పండించాడు. సీరియస్ టోన్ డిమాండ్ చేసే ఇలాంటి క్యారెక్టర్లకు కావాల్సిన ఎమోషన్లు, ఎక్స్ ప్రెషన్లు సరిపడా ఇచ్చేశాడు. సంయుక్త మీనన్ కు ప్రాధాన్యం దక్కింది. దానికి తగ్గట్టే ఉనికిని చాటుకుంది. మాళవిక నాయర్ క్యారెక్టరైజేషన్ బాగున్నప్పటికీ తనకు లెన్త్ పరిమితంగా ఉండటంతో ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా లిమిట్ పెట్టేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ అతి లేకుండా ఓకే అనిపించాడు. రఫీకి ఇచ్చిన ఒకటి రెండు సీన్లలో తన అనుభవాన్ని గుర్తించేలా చేశాడు. సత్య కామెడీ అంతగా పేలలేదు. సీత, హరితేజ, మహేష్, అజయ్, తదితరులకు తక్కువ స్కోప్ దొరికింది కానీ సరిపోయారు.

సాంకేతిక వర్గం

హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా పనితనం చూపించినప్పటికీ కొన్ని చోట్ల బెస్ట్ గా, కొన్ని చోట్ల సౌండ్ ఎక్కువైపోయి మిశ్రమ స్పందన కలిగిస్తుంది. పాటలు నిరాశపరుస్తాయి. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం టాప్ స్టాండర్డ్ లో ఉంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయని, దర్శకుడి ఆలోచనని చక్కగా ఆవిష్కరించింది. తమ్మిరాజు ఎడిటింగ్ లో మరీ లోపాలేం లేవు కానీ తొలి సగంలోని ల్యాగ్ ని కాస్త కుదించాల్సింది. పోరాట దృశ్యాలు బాగా వచ్చాయి. కథ స్క్రీన్ ప్లే సమకూర్చిన శ్రీకాంత్ విస్సా మాటలు మాత్రం మాములుగా అనిపిస్తాయి. అభిషేక్ సంస్థ ప్రొడక్షన్ వేల్యూస్ ఘనంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో రాజీ పడని దాఖలాలు కనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్

కళ్యాణ్ రామ్
డిఫరెంట్ స్టోరీ
నిర్మాణ విలువలు
కొన్ని సెకండాఫ్ ట్విస్టులు

మైనస్ పాయింట్స్

హై అనిపించని యాక్షన్
ఫ్లాట్ ఫస్ట్ హాఫ్
పాటలు
క్లైమాక్స్ హడావిడి

ఫినిషింగ్ టచ్ : తడబడిన గూఢచారి

రేటింగ్ : 2.5/5