సమీక్ష – యానిమల్

2.75/5

3 Hr 21 Mins   |   Action   |   01-12-2023


Cast - Ranbir Kapoor, Rashmika, Anil Kapoor, Bobby Deol, Prithivee raj, Shakti Kapoor and others

Director - Sandeep Reddy Vanga

Producer - Bhushan Kumar & Pranay Reddy Vanga

Banner - Bhadrakali Pictures and T Series

Music - Harshwardhan Rameshwar and others

ఒక హిందీ డబ్బింగ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన హైప్ రావడం అరుదు. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ తో పాటు రన్బీర్ కపూర్ చేసిన యాక్టింగ్ గురించి ట్రైలర్ లో చూపించిన ఎలివేషన్లు యానిమల్ అంచనాలను అమాంతం పెంచేశాయి. దెబ్బకు ఏపీ తెలంగాణలో తెల్లవారుఝాము నుంచే షోలు మొదలైపోయాయి. 3 గంటల 23 నిమిషాల సుదీర్ఘ నిడివికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని దర్శకుడు ఇచ్చిన హామీని ఆడియన్స్ నమ్మారు. అందుకే ఇంత భారీ ఓపెనింగ్స్. మరి హైప్ ని నిలబెట్టుకున్నాడా

కథ

రణ్ విజయ్ సింగ్(రన్బీర్ కపూర్)కు తండ్రి బల్బీర్ సింగ్(అనిల్ కపూర్)అంటే వల్లమాలిన ప్రేమ. విపరీత ప్రవర్తన కారణంగా కుటుంబం నుంచి దూరంగా ప్రేమించిన గీతాంజలి(రష్మిక మందన్న)ను తీసుకుని విదేశాలకు వెళ్తాడు. ఓ రోజు బల్బీర్ మీద హత్యా ప్రయత్నం జరగడంతో విజయ్ తిరిగి వచ్చి శత్రువు అంతు చూస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దీని వెనుక అబ్రార్(బాబీ డియోల్) ఉన్నాడని తెలుస్తుంది. తన ప్రాణాలు సైతం ప్రమాదంలో పడతాయి. ప్రతీకారాన్ని తెగబడిన రణ్ విజయ్ చివరికి తాను అనుకున్నది ఎలా సాధించాడనేదే స్టోరీ

విశ్లేషణ

అగ్రెసివ్ (హద్దులు దాటే ప్రవర్తన) హీరోయిజంలో ఒక కొత్త ఒరవడి సృష్టించిన దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగాకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండను చూపించిన తీరు ప్రశంసలు కలెక్షన్లు రెండూ తెచ్చి పెట్టింది. హిందీ రీమేక్ సైతం అదే ఫలితాన్ని అందుకుంది. ఒక ప్రేమకథలోనే అంత డెప్త్ చూపించినప్పుడు రివెంజ్ డ్రామాకి ఇంకే స్థాయిలో ఇంటెన్సిటీ (తీవ్రత) పండించే అవకాశం ఉంటుందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. తన మొదటి సినిమాలో ప్రియురాలి మీద అతి ప్రేమను ఇందులో తండ్రికి షిఫ్ట్ చేసిన సందీప్ ఇక్కడ అంతకు మించి పదింతల నేపధ్యాన్ని తీసుకున్నాడు. ఇది ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది.

సన్నివేశాల కంటే క్యారెక్టరైజేషన్ లోని బలం మీద ఎక్కువ ఆధారపడే సందీప్ ఇందులోనూ అదే చేశాడు. రణ్ విజయ్ ఎందుకంత వయొలెంట్ గా ఆలోచిస్తాడనే దానికి కారణం చూపించకపోయినా కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తాడో అక్కని ర్యాగింగ్ చేసినవాళ్లని అటకాయించిన ఎపిసోడ్ తో మొదలుపెట్టి స్వంత బావని ఎదిరించే సీన్ దాకా చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు. దానికి అద్భుతమైన రన్బీర్ కపూర్ పెర్ఫార్మన్స్ తోడవ్వడంతో తొందరగా కనెక్ట్ అవుతాం. గీతాంజలిని ఒప్పించి తన ఇంటికి వచ్చేలా చేసే క్రమాన్ని అంత కన్విన్సింగ్ గా చెప్పలేకపోయినా పెళ్లి జరిగాక ఇద్దరి మధ్య ఏర్పడే బంధాన్ని మాత్రం చక్కగా హ్యాండిల్ చేయడం మెప్పిస్తుంది.

ఇంటర్వెల్ దాకా ఫ్లోలో ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు విలన్ ని రివీల్ చేయకుండా భీభత్సమైన వయొలెన్స్ తో విశ్రాంతి ఫైట్ డిజైన్ చేసినా హీరో తాలూకు బాధను ఫీలవుతూ ఉంటాం కాబట్టి ఎలాంటి లోటు లేదనిపిస్తుంది. రణ్ విజయ్ ప్రవర్తనలోని హెచ్చుతగ్గులు ఎక్కడికక్కడ నటీనటుల నటన, బీజీఎమ్ తో కప్పబడుతూ పోయాయి. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అసలు సమస్య వస్తుంది. రన్బీర్ కున్న ఆరోగ్య సమస్యని రిజిస్టర్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్న సందీప్ వంగా ఆ తర్వాత తండ్రిని చంపేందుకు ప్రయత్నించింది ఎవరో కనుక్కునేందుకు వేసిన ఎత్తుగడని వేగంగా నడిపించకపోవడం అవసరం లేని ల్యాగ్ కు దారి తీసింది.

దీనికి తోడు రణ్ విజయ్, గీతాంజలి బాండింగ్ లోని గొప్పదనాన్ని ఇంకా డిటైల్డ్ గా చెప్పాలనే ఉద్దేశంతో పెట్టిన ఎమోషనల్ సీన్స్ లో లెన్త్ ఎక్కువయ్యింది. ఆర్టిస్టులు ఎంత గొప్పగా నటిస్తున్నా సీన్స్ లోని డ్రామా పాలు తగ్గినప్పుడు సహజంగానే బోర్ కొట్టడం మొదలవుతుంది. పైగా యానిమల్ పేరుకి న్యాయం జరగాలంటే వీలైనంత త్వరగా హీరో విలన్ తలపడాలి. అంతే తప్ప హీరో హీరోయిన్ల భావోద్వేగాలను అవసరానికి మించి చెప్పడానికి ట్రై చేస్తే మాస్ ఆడియన్స్ నిరాశ పడే ఛాన్స్ ఉంది. ప్రాణాంతకమైన వ్యాధి నుంచి బయట పడ్డాక హీరో చేసే పనులు ఎక్స్ ట్రాడినరిగా ఉండాలి. ఆడియన్స్ అలాగే ఊహించుకుంటారు. విశ్రాంతి తాలూకు ఇంపాక్ట్ అది.

కానీ ఆలా జరగకపోవడం యానిమల్ రెండో సగంలోని ప్రధానమైన మైనస్. మొదట్లో అక్కా చెలెళ్ల మీద రణ్ ప్రేమను చూపించి ఆ తర్వాత వాళ్ళను పూర్తిగా సైడ్ ట్రాక్ చేయకుండా ఉండాల్సింది. ఈ కుటుంబం గురించి అంతా తెలిసిన అబ్రార్ సంవత్సరాల తరబడి ఎందుకు మౌనంగా ఉన్నాడనేది జస్టిఫై కాలేదు. పైగా అతని ఎంట్రీ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ఎడిటింగ్ లో ఏమైనా ట్రిమ్ అయ్యిందేమో కానీ ఆ పాత్రకు ఇచ్చిన బిల్డప్, బాబీ డియోల్ క్యాలిబర్ ని సరిగా వాడుకోకపోవడంతో చాలా తక్కువ నిడివితో అతను వృథా అయ్యాడు. ఒకవేళ అబ్రార్ ని త్వరగా తీసుకొచ్చి రణ్ తో ప్రాణాంతకమైన ఆటను ఢిల్లీలోనే ఆడించి ఉంటే వేరే స్థాయిలో ఉండేదేమో

టెక్నికల్ గా యానిమల్ ఉన్నత ప్రమాణాల్లోనే ఉంది. చూసే జనాలు ఒక రకమైన ప్రిపరేషన్ ఉంటే తప్ప ఇలాంటి కంటెంట్ ని ఎంజాయ్ చేయలేరు. అలా అని థియేటర్ సినిమా అంటే పరీక్ష కాదు ముందుగా చదివి సిద్ధం కావడానికి. యాక్షన్ డ్రామాల జమానాలో, మ్యూజిక్ సపోర్ట్ ఇచ్చి బ్లాక్క్ బస్టర్స్ కొడుతున్న ట్రెండ్ లో యానిమల్ రేంజ్ ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ సందీప్ వంగా నుంచి అంతకుమించి అంటూ ఊహించుకున్న అభిమానులకు కొంత అసంతృప్తినైతే మిగులుస్తుంది. రన్బీర్ కపూర్, అనిల్ కపూర్, హర్షవర్షన్ రామేశ్వర్ ఈ మూడు పేర్ల పట్ల ఆరాధనా భావం లేదా ఇష్టం ఉంటే యానిమల్ ని హ్యాపీగా చూసేయొచ్చు.

నటీనటులు

ఇది రన్బీర్ కపూర్ వన్ మ్యాన్ షో, రాక్ స్టార్, సంజులని మించిన నటనను ప్రదర్శించడానికి ఇందులో స్కోప్ దక్కింది. ఒకరకంగా చెప్పాలంటే ఆడేసుకున్నాడు. రష్మిక మందన్న గీతాంజలిగా న్యాయం చేసింది. బరువైన సీన్లు పడినా తొణకలేదు. అనిల్ కపూర్ అనుభవం పూర్తిగా ఉపయోగపడింది. పృథ్వి కనిపించేది కాసేపే అయినా గుర్తుంటాడు. ఎంతో ఆశించిన బాబీ డియోల్ కి అతని కెపాసిటీకి తగ్గ నిడివి పడలేదు. ఒకరకంగా నిరాశే. ఎక్కువ మాటలు లేకుండా శక్తి కపూర్ హుందాగా ఉన్నారు. హీరో తల్లిగా చారు శంకర్, కీలక మలుపుకు ఉపయోగపడిన త్రిప్తి బాగున్నారు. ఇతరుల్లో జూనియర్ సీనియర్ అన్ని రకాల ఆర్టిస్టులను సందీప్ వాడుకున్నాడు

సాంకేతిక వర్గం

హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలం. హోరెత్తే సౌండ్ లేకుండా పర్ఫెక్ట్ ఎలివేషన్ వచ్చేలా కంపోజ్ చేసిన తీరు వెంటాడుతుంది. ఇతనితో పాటు పాటలు స్వరపరిచిన మరో ఆరుగురు సంగీత దర్శకుల నుంచి వచ్చిన వాటిలో నాన్న సెంటిమెంట్, అర్జన్ వైల్లి రెండూ విజువల్ గానూ బాగా వచ్చాయి. అమిత్ రాయ్ ఛాయాగ్రహణంలో ఎలాంటి లోపం లేదు. కెమెరా వర్క్ కూల్ గా ఉంది. సందీప్ వంగానే ఎడిటర్ కాబట్టి తను తీసిన దానిమీదున్న ఆపేక్ష కత్తెరకు అడ్డుపడటం కనిపిస్తుంది. టి సిరీస్, భద్రకాళి సంస్థల సంయుక్త నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడిన దాఖలాలు లేవు

ప్లస్ పాయింట్స్

రన్బీర్ కపూర్ నటన
నేపధ్య సంగీతం
ఫస్ట్ హాఫ్
ఇంటర్వెల్ బ్యాంగ్

నెగటివ్ పాయింట్స్

విలన్ ట్రాక్
రెండో సగంలో సాగతీత
కొంత అడల్ట్ కామెడీ
నిడివి

ఫినిషింగ్ టచ్ : వయొలెంట్ హాఫ్ యానిమల్

రేటింగ్ : 2.75 / 5