సమీక్ష – గాండీవధారి అర్జున

2/5

2 Hr 17 Mins   |   Action   |   25-08-2023


Cast - Varun Tej, Sakshi Vaidya, Nassar, Vimala Raman, Vinay Rai, Narain, Roshini Prakash and others

Director - Praveen Sattaru

Producer - BVSN Prasad

Banner - SVCC

Music - Mickey J Meyer

మెగా ఫ్యామిలీ నుంచి ఒడ్డు పొడవుతో పాటు టాలెంట్ మూటగట్టుకున్న వరుణ్ తేజ్ ఈసారి గాండీవధారి అర్జునతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాములుగా ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు ఉండాల్సిన హైప్ దీని విషయంలో కనిపించలేదు. కానీ హీరోతో పాటు దర్శకుడు ప్రవీణ్ సత్తారు కంటెంట్ మీద గట్టి నమ్మకాన్ని పలు ఇంటర్వ్యూలలో వ్యక్తం చేశారు. గని డిజాస్టర్ తర్వాత మూవీ కావడంతో మెగా ప్రిన్స్ కి దీని సక్సెస్ చాలా కీలకం. హై యాక్షన్ తో రూపొంది లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన ఈ అర్జునుడు యుద్ధంలో గెలిచాడా లేదా

కథ

యుకెలో భారతదేశం తరఫున పర్యావరణ పరిరక్షణ మీద ఒక సమ్మిట్ హాజరు కావడానికి వెళ్లిన మంత్రి ఆదిత్యరాజ్(నాజర్)కు ప్రాణాపాయం ఉంటుంది. ఆయనకు రక్షణగా ఉండేందుకు వస్తాడు అర్జున్ వర్మ(వరుణ్ తేజ్). మినిస్టర్ పిఎ(సాక్షి వైద్య)తో తనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ప్రమాదరకమైన ఒక సమస్యకు మూలమైన కార్పొరేట్ కంపెనీ అధినేత రన్వీర్(వినయ్ వర్మ) వల్లే ఇదంతా జరుగుతుందని అర్జున్ తెలుసుకుని కుట్రని భగ్నం చేయబోతాడు. ఇక్కడి నుంచి అసలైన పిల్లి ఎలుక చెలగాటం మొదలవుతుంది.

విశ్లేషణ

గూఢచారి సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. దేశానికి ఏదైనా ముప్పు రావడం లేదా ఒక కీలకమైన వ్యక్తి ప్రాణాల కోసం శత్రువులు వెంటపడినప్పుడు కథానాయకుడు దాన్నుంచి అతన్ని కాపాడ్డం. కృష్ణ, చిరంజీవిల నుంచి మొన్నటి నిఖిల్ దాకా అందరూ ఈ జానర్ ని ట్రై చేసినవాళ్ళే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గత ఏడాది ది ఘోస్ట్ లో నాగార్జునని ఒక కొత్త తరహా స్పైగా చూపించబోయి ఆశించిన ఫలితం అందుకోలేదు. దీంతో సహజంగానే కసితో ఇప్పుడీ అర్జునధారి గాండీవ తీసి ఉంటారని ఆశించడం సహజం. ఎందుకంటే ఒక బ్యాక్ డ్రాప్ లో ఫెయిలేనప్పుడు మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. కానీ ప్రవీణ్ సత్తారు మాత్రం అదే తేనె తుట్టెను కదిపారు.

సొసైటీకి సంబంధించిన ఒక డేంజర్ ఇష్యూని తీసుకుని దానికి కమర్షియల్ కోటింగ్ తో యాక్షన్ డ్రామా తీయాలనుకోవడం మంచి ఆలోచనే. కానీ దానికి కేవలం హాలీవుడ్ మూవీస్ నుంచి స్ఫూర్తి చెందితే సరిపోదు. ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితమే ఆర్నాల్డ్, విన్ డీజిల్ లాంటి వాళ్ళు ఇలాంటివి లెక్కలేనన్ని చేశారు. అలాంటప్పుడు 2023లో వస్తున్న అర్జునుడు చాలా అప్డేట్ గా ఉండాలి. కానీ అంత తెలివి, భుజబలం ఉన్న గాండీవధారుడు చాలా రహస్యాలు కలిగిన హార్డ్ డిస్క్ తన చేతికి వచ్చినప్పుడు మినిస్టర్ దగ్గర సీరియల్ లో లేడీ ఆర్టిస్టులా నాకొద్దు నేను చూడనని పంతం పడతాడు. ఇది ముమ్మాటికీ క్యారెక్టర్ డిజైన్ లో వచ్చిన ప్రాధమిక లోపం.

ఇలాంటి తప్పులు ప్రవీణ్ సత్తారు చాలా చేశారు. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాని మొత్తం బ్రిటన్ లో తీయడంతో నేటివిటీ జీరో అయిపోయి ఏదో ఇంగ్లీష్ డబ్బింగ్ డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. మంత్రి మనవరాలి రూపంలో ఓ పాప సెంటిమెంట్ ని జోడించబోయారు కానీ అది కూడా పాతకాలం నాటి వాసనే కొడుతుంది. ఇండియాలో మనం ఎన్ని వేషాలు వేసినా చెల్లుతుంది కానీ యుకెలోనూ పోలీస్ వ్యవస్థ అమాయకంగా ఉంటుందనేలా పోరాటాలు, ఛేజులు చిత్రీకరించిన తీరు లాజిక్ కి దూరంగా వెళ్లిపోయింది. పఠాన్ లో చూశారు కదానే ప్రశ్న ఆడగొచ్చు. కొండంత షారుఖ్ ఇమేజ్ ముందు రాళ్లంత తప్పుల్ని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు.

కానీ ఇక్కడ ఉన్నది వరుణ్ తేజ్. తన మీద సూపర్ హీరో అనే అభిప్రాయం జనంలో లేదు. సో వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. ఫస్ట్ హాఫ్ లో చాలా సమయం అర్జున్ ఫ్లాష్ బ్యాక్ కి, నాజర్ ఫ్యామిలీ సెంటిమెంట్ కి ఎక్కువ ఖర్చు పెట్టిన ప్రవీణ్ సత్తారు ఇంటర్వెల్ దాకా అసలు విలన్ ఏం చేయబోతున్నాడో, ఎందుకు అరాచకం సృష్టిస్తున్నాడో గుట్టు విప్పలేదు. దానికి తోడు హీరో తల్లికున్న జబ్బుని రియలిస్ట్ గా చూపించాలన్న తపనతో చేసిన మేకప్, పదే పదే క్లోజప్ షాట్స్ చూపించిన విధానం మొహం పక్కకు తిప్పుకునేలా చేసింది. ఇక్కడ సానుభూతికి బదులు జుగుప్స కలిగిందంటే దానికి కారణం భావోద్వేగం పేరుతో సింపతిని ఓవర్ ఎక్స్ ప్లాయిట్ చేయాలనే ప్రయత్నమే.

సెకండ్ హాఫ్ లో మంచి యాక్షన్ బ్లాక్స్ కి బోలెడు స్కోప్ ఉన్నా ప్రవీణ్ సత్తారు ఎంతసేపూ అర్జున్ తప్పించుకోవడం మీద దృష్టి పెట్టాడు తప్పించి విలన్ కి అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి తెలివితేటలు వాడాడనేది చూపించలేదు. దీని వల్ల వరుణ్ తేజ్ చేసే ఫైట్లు, అడ్వెంచర్లు చప్పగా తేలిపోయాయి తప్పించి టెంపో పెంచడానికి ఉపయోగపడలేదు. మనం పారబోసే చెత్త భూమ్మీద ఎంత ప్రమాదమైందో చెప్పాలనుకున్నప్పుడు దానికి సరైన పరిష్కారం ఏమిటో కూడా చూపాలి. అంతే తప్ప క్లైమాక్స్ లో నాజర్ తో సుదీర్ఘమైన ప్రసంగం ఇప్పించడం వల్ల ప్రయోజనం కలిగదు. డాక్టర్ ఆపరేషన్ ని ఎంత బాగా చేసినా పేషేంట్ బ్రతకనప్పుడు ఆ శ్రమంతా వృథానే.

నటీనటులు

వరుణ్ తేజ్ తనవంతుగా దర్శకుడు అడిగింది చేసుకుంటూ పోయాడు. గని ఫ్లాప్ అయినా సరే కనీసం అందులో పెర్ఫార్మన్స్ చూపించడానికి కొంత స్కోప్ దక్కింది. ఇందులో ఒకటి రెండు సీన్లు మినహా అంతగా ఛాన్స్ దొరకలేదు. సాక్షి వైద్య ఏజెంట్ తర్వాత మరోసారి ఉత్సవ విగ్రహమే అయ్యింది. అందం, అభినయం రెండూ సున్నానే. నాజర్ బరువుగా నటించారు. పాత్ర డిమాండ్ అని సరిపెట్టుకోవాలి. విమలా రామన్ రెండు సీరియస్ లుక్స్, కన్నీళ్లకు పరిమితం చేశారు. విలన్ వినయ్ వర్మ పర్వాలేదు. వరుణ్ డాక్టర్ తర్వాత అలాంటి క్యారెక్టరే కానీ ప్రయోజనం లేదు. రవివర్మ, అభినవ్ గోమటం లాంటి ఆర్టిస్టులను సరిగా వాడుకోలేదు.

సాంకేతిక వర్గం

మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎలాంటి ప్రత్యేకత లేదు. రెగ్యులర్ సౌండ్ తో పని కానిచ్చేశారు. ఎక్కడో విన్నట్టుందే అనిపించేలా సాగింది. పాటలు ఎక్కువ లేకపోయినా ఉన్న ఒకటి రెండు కూడా స్మార్ట్ ఫోన్ చూసేందుకు ఉపయోగపడ్డాయి. ముఖేష్ జి ఛాయాగ్రహణం కంటెంట్ కు తగ్గట్టే హడావిడిగా ఉంది. ఆకట్టుకునేలా లేదు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ని నిడివిపరంగా నిందించలేం. రాత ప్లస్ తీతలో డైరెక్టర్ బ్యాలన్స్ తప్పినప్పుడు కత్తెర వేసే వాళ్ళ పాత్ర లిమిటెడ్ అయిపోతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ రెగ్యులర్ స్టయిల్ లోనే ఉంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం విదేశాల్లో తీసినా నో అనకుండా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

వరుణ్ తేజ్
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

చప్పగా సాగే పోరాటలు
లవ్ అండ్ ఎమోషన్స్
విలన్ ట్రాక్
ఫ్లాట్ నెరేషన్

ఫినిషింగ్ టచ్ : విరిగిపోయిన గాండీవం

రేటింగ్ : 2 / 5