సమీక్ష- కింగ్ అఫ్ కొత్త

2/5

2 Hr 56 Mins   |   Action   |   24-08-2023


Cast - Dulquer Salmaan, Aishwarya Lekshmi, Shabeer, Prasanna, Usha, Anika and others

Director - Abhilash Joshiy

Producer - Dulquer Salmaan

Banner - Wayfarer Films & Zee Studios

Music - Jakes Bejoy, Shaan Rahman

మలయాళం హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకూ దుల్కర్ సల్మాన్ బాగా సుపరిచితం. ముఖ్యంగా మహానటి తర్వాత అతని పరిచయం ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ పెరిగింది. కనులు కనులు దోచాయంటే, కురుప్ లాంటివి డబ్బింగ్ అయినా సరే కమర్షియల్ గా పే చేయడంతో ఇక్కడ తనకో మార్కెట్ ఏర్పడింది. అందుకే కింగ్ అఫ్ కొత్త ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేశాడు. ప్రమోషన్లలో చూస్తే ప్రామిసింగ్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా కనిపించిన ఈ కొత్త డాన్ మెప్పించేలా ఉన్నాడా

కథ

1986 సంవత్సరం. కేరళలోని కోతా పట్టణంలో రాజు(దుల్కర్ సల్మాన్)తన స్నేహితుడు కన్నన్(షబ్బీర్ కల్లరక్కల్)తో కలిసి రౌడీయిజం చేస్తూ జనాన్ని గుప్పిట్లో పెట్టుకుంటాడు. లైబ్రరీ నడిపే తార(ఐశ్వర్య లక్ష్మి)ని ప్రేమిస్తాడు. కొన్ని అనూహ్య పరిణామాలు జరిగి చెల్లెలి(అనీఖా సురేంద్రన్)క్షేమం కోసం లక్నో వెళ్ళిపోయి అక్కడ రాజు మదరాసిగా మరో సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. కోతా మాఫియాని కన్నన్ హస్తగతం చేసుకుంటాడు. పదేళ్ల తర్వాత రాజు తిరిగి రావాల్సిన దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయి. తర్వాత జరిగేది స్టోరీ

విశ్లేషణ

గ్యాంగ్ స్టర్ డ్రామాలు తెరకు కొత్త కాదు. దశాబ్దాలుగా ప్రేక్షకులు ఎన్నో చూస్తూ వస్తున్నారు. అయితే ఇది అంత సులభంగా ఫేడ్ అవుట్ అయ్యే సబ్జెక్టు కాదు. సరైన రీతిలో రాసుకుని ఎలివేషన్లు, ఎమోషన్లు పండిస్తే జనం ఎగబడి చూస్తారని కెజిఎఫ్ 2 నిరూపించడం ఇంకా కళ్ళముందు పచ్చిగానే ఉంది. దర్శకుడు అభిలాష్ జోషియ్ దాన్నే స్ఫూర్తిగా తీసుకున్న వైనం కనిపిస్తుంది. రాఖీ భాయ్ అరాచకాన్ని రాజుకి షిఫ్ట్ చేసి బంగారు గనులకు బదులు ఓ సముద్ర తీర ప్రాంతాన్ని తీసుకున్నాడు. తల్లికి బదులు ఫాదర్ సెంటిమెంట్ పెట్టుకున్నాడు. బోనస్ గా చెల్లి థ్రెడ్. మణిరత్నం దళపతి నుంచి ఫ్రెండ్ షిప్ పాయింట్ తీసుకుని దాన్నీ వాడుకున్నాడు.

ఇదంతా బాగానే ఉంది కానీ కింగ్ అఫ్ కొత్తలో ఉన్న ప్రధానమైన సమస్య నిడివి వల్ల వచ్చిన డీటెయిలింగ్. సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత దుల్కర్ ఎంట్రీ ఉంటుంది. పోనీ అప్పటిదాకా నడిచింది ఏమైనా మైండ్ బ్లోయింగ్ గా ఉందా అంటే అదీ లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ ఫర్ మీద వచ్చి కన్నన్ ఎంత దుర్మార్గుడో తెలుసుకోవడం కోసం అంత లెన్త్ పెట్టడం అవసరం లేదు. దీని వల్ల రాజు కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి విసుగు వచ్చేస్తుంది. అతను ఎంట్రీ ఇచ్చాక జరిగే క్రమంలో మరీ ఎగ్జై టింగ్ గా లేకపోయినా ఆర్టిస్టుల బలం, సాంకేతిక వర్గం మద్దతు వల్ల దారుణం అనిపించకుండా ఇంటర్వెల్ దాకా బండి ఏదోలా నెట్టుకొచ్చాడు.

రాజు కోతాకు తిరిగి వచ్చాక చేసే మర్డర్ తో ఒక్కసారిగా ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఇక్కడి నుంచి స్క్రీన్ ప్లే పరుగులు పెట్టి ఉంటే అభిలాష్ లక్ష్యం నెరవేరేది. కానీ స్నేహాన్ని, ప్రతీకారాన్ని, కుటుంబ బంధాన్ని మూడింటిని బ్యాలన్స్ చేయాలనే క్రమంలో అవసరం లేని సీన్లు, భావోద్వేగాలు ఇరికించడంతో అంతా ఊహించినట్టే జరిగిపోతుంది. దీంతో రాజు చేసే పనులేవీ థ్రిల్ ఇవ్వవు. తండ్రి ఒకప్పుడు పేరు మోసిన రౌడీ అని ఎస్టాబ్లిష్ చేసిన దర్శకుడు దాన్నీ సరిగ్గా వాడుకోలేకపోయాడు. జెక్స్ బిజోయ్ ఫుల్ డ్యూటీ చేశాడు కాబట్టి బలహీనమైన చాలా సన్నివేశాలు అతనిచ్చిన బ్యాక్ గ్రౌండ్ తో నిలబడిపోయాయి. లేదంటే గ్రాఫ్ ఇంకా కిందకు వెళ్ళేది.

టెక్నికల్ గా అభిలాష్ జోషియ్ లో విషయముంది కానీ దానికి సరిపడా బలమైన రైటింగ్ తోడవ్వలేదు. చెడ్డవాళ్లను హీరోలుగా చూపించినప్పుడు వాళ్ళు చేసింది ఏదో మంచి ఉందని చూసేవాళ్లకు అనిపించాలి. కానీ రాజు తాగడం, తిరగడం తప్ప ప్రత్యేకంగా ఓ ఊరి కోసం ఏం చేశాడనేది ఎక్కడా చూపించలేదు. గంజాయి లేకుండా చేయడం కూడా అదేదో ప్రియురాలి కోసం తప్పించి జనాలకు మేలు చేయాలని కాదు. ఇలాంటి క్యారెక్టరైజేషన్ లోపాలు రాజు మీద ఆరాధనాభావం రాకుండా అడ్డుపడ్డాయి. కన్నన్ తల్లి అంతగా రాజు మీద అభిమానం చూపించడం సైతం కృత్రిమంగా ఉంది. ఇలా ఎగుడుదిగుడుల ప్రయాణంలో అవసరం లేని స్పీడ్ బ్రేకర్లే ఎక్కువ.

కేవలం సాంకేతిక వర్గం పనితనం చూసేందుకు పబ్లిక్ టికెట్లు కొనరు. వాళ్లకు కంప్లీట్ ప్యాకేజ్ కావాలి. ఇలాంటి పొరపాటే సందీప్ కిషన్ మైఖేల్ లోనూ జరిగింది. సూర్య సికందర్ లోనూ చూశాం. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కింగ్ అఫ్ కోత కూడా వాటి సరసనే నిలిచింది కానీ దుల్కర్ సల్మాన్ లాంటి పవర్ హౌస్ ని వాడుకున్న క్లాసిక్ గా నిలవలేకపోయింది. సినిమాలో పాత్రలన్నీ ఊరి పేరుని కోతా కోతా అని స్పష్టంగా పలుకుతుంటే టైటిల్ లో మాత్రం కొత్త ఎందుకు పెట్టారో అక్షరాలు రాసిన వాళ్లకు, డిజైన్ చేసిన వాళ్లకు తెలియాలి. నేటివిటీ సమస్య కూడా కొంచెం ఇబ్బంది కలిగించింది. ఆర్టిస్టులందరూ మలయాళం బ్యాచే కావడంతో పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేం.

నటీనటులు

ఊరిని భయపెడుతూనే ప్రేమ, కుటుంబ బంధాలకు లోబడే రాజు పాత్రలో దుల్కర్ సల్మాన్ సులభంగా ఒదిగిపోయాడు. స్క్రీన్ ప్రెజెన్స్, నటన రెండు వంక పెట్టలేని విధంగా ఉన్నాయి. ఐశ్వర్య లక్మి కొంతవరకే పరిమితం. హీరోతో సమానంగా కనిపించే ఫ్రెండ్ గా షబ్బీర్ గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ కన్నా ఎక్కువగా ఆకట్టుకునేది మంజు పాత్రలో మెరిసిన నైలా ఉషా. సిఐ షాహుల్ హుసేన్ గా ప్రసన్నకు ఎక్కువ స్పేస్ ఇచ్చారు కానీ బిల్డప్ ఇచ్చినంత రేంజ్ లో క్యారెక్టర్ ని డిజైన్ చేయలేదు. అనీఖా వృథా అయ్యింది. గోకుల్ సురేష్, శరన్, చెంబన్ వినోద్ జోస్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, రాజేష్ శర్మ, సెంథిల్ కృష్ణ తదితరులు సహజంగా ఉన్నారు.

సాంకేతిక వర్గం

జేక్స్ బెజోయ్ నేపధ్య సంగీతం ఈ కింగ్ అఫ్ కోతకు సంబంధించి నూటికి నూరు శాతం న్యాయం చేసింది. పాటల పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా బిజిఎం మాత్రం చాలా బాగా వచ్చింది. నిమిష్ రవి ఛాయాగ్రహణం ఆర్ట్ వర్క్ తో పోటీపడింది. అప్పటి వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఉమా శంకర్ సేతుపతి ఎడిటింగ్ మాత్రం విమర్శలకు తావిచ్చింది. సులభంగా ఇక్కడ లేపేస్తే పోతుందనిపించే సన్నివేశాలను సైతం అలాగే ఉంచేయడంతో ల్యాగ్ విపరీతంగా పెరిగిపోయింది. స్టంట్స్ బాగున్నాయి. రచయిత అభిలేష్ చంద్రన్ రాతలో కొత్తదనం లేదు. జీతో కలిసి తనే భాగస్వామిగా మారిన దుల్కర్ ప్రొడక్షన్ లో రాజీ పడలేదు

ప్లస్ పాయింట్స్

దుల్కర్ సల్మాన్
నేపధ్య సంగీతం
క్యాస్టింగ్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథా కథనాలు
సాగతీత టేకింగ్
పండని ఎమోషన్, యాక్షన్
ట్విస్టులు

ఫినిషింగ్ టచ్ : వినపడని మోత

రేటింగ్ : 2/5